సామాన్యులకు వరాలు: గోయల్ ఎన్నికల బడ్జెట్

By narsimha lodeFirst Published Feb 1, 2019, 1:45 PM IST
Highlights

త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ప్రజలకు వరాలు కురిపించింది. రైతులకు పెట్టుబడి స్కీమ్‌తో పాటు,  ఆదాయ పన్ను పరిమితిని రూ.ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు

న్యూఢిల్లీ:త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ప్రజలకు వరాలు కురిపించింది. రైతులకు పెట్టుబడి స్కీమ్‌తో పాటు,  ఆదాయ పన్ను పరిమితిని రూ.ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు 60 ఏళ్లు దాటితే పెన్షన్ ఇవ్వనున్నట్టు కేంద్రం కొత్త పథకాన్ని ప్రకటించింది.

ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం  ఆరో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  శస్త్రచికిత్స కోసం లండన్‌లో ఉన్నందున  పీయూష్ గోయల్ శుక్రవారం నాడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అమలు చేస్తున్నట్టుగానే కేంద్రం కూడ రైతులకు పెట్టుబడికి ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున ఒక్కో రైతుకు పెట్టుబడి సహాయంగా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఐదు ఎకరాల లోపు ఉన్న రైతాంగానికి ఎకరానికి రూ.6వేల చొప్పున పరిహారాన్ని చెల్లించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలోని 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది.

ఈ పథకాన్ని 2018 డిసెంబర్ నుండి అమలు చేస్తామని కేంద్రం  ప్రకటించింది. తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేసిన కేసీఆర్ సర్కార్  ఎన్నికల్లో అద్భుత ఫలితాలను సాధించింది. మరో వైపు  కేంద్రం కూడ  ఇదే పథకాన్ని అమలు చేయడం ద్వారా రైతాంగాన్ని తమ వైపుకు  తిప్పుకొనే ప్రయత్నంగా  విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆదాయపు పన్ను పరిమితిని రెండున్నర లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. మధ్య తరగతి ప్రజలకు ఆదాయపు పన్ను పరిమితి పెంపు కారణంగా ప్రయోజనం కలగనుంది.  ఉద్యోగులు, పెన్షనర్లు సుమారు 3 కోట్ల మంది దీని వల్ల ప్రయోజనం పొందనున్నారు.

అసంఘటిత రంగ కార్మికులకు కూడ పెన్షన్ స్కీమ్‌ను కేంద్రం ప్రకటించింది. 60 ఏళ్లు దాటిన  కార్మికులకు ప్రతి నెల రూ3 వేల చొప్పున  పెన్షన్ ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ప్రతి నెల రూ.100 చెల్లిస్తే   60 ఏళ్లు దాటిన తర్వాత  ప్రతి నెల రూ.3 వేలు పెన్షన్  పొందనున్నారు.ఉద్యోగులు గ్రాట్యూటీ పరిమితిని రూ.10 లక్షల నుండి రూ30 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు.

ఇళ్ల కొనుగోలు దారులకు కూడ కేంద్రం తీపి కబురును అందించింది. జీఎస్టీని తగ్గించనున్నట్టు ప్రకటించింది. అయితే ఎంత మేరకు జీఎస్టీని తగ్గించనుందో అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. సినిమా థియేటర్లలో జీఎస్టీని 12 శాతానికి తగ్గించారు.

త్వరలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఈ బడ్జెట్ రూపొందించినట్టు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


 

click me!