మా రాష్ట్ర విద్యార్థులకు ‘నీట్’ పరీక్ష వద్దు.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

By telugu teamFirst Published Sep 13, 2021, 2:39 PM IST
Highlights

తమ రాష్ట్ర విద్యార్థులకు నీట్ పరీక్ష నుంచి మినహాయింపునిచ్చే ఉద్దేశంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. మొదటి నుంచీ తమిళనాడులోని ప్రధాన పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకే నీట్ పరీక్షను వ్యతిరేకిస్తున్నాయి. తాజా బిల్లుకు తామూ మద్దతిస్తామని ప్రతిపక్ష ఏఐఏడీఎంకే వెల్లడించడం గమనార్హం.

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం తొలిసారిగా యాంటీ నీట్ బిల్లును ప్రవేశపెట్టింది. తమ రాష్ట్ర విద్యార్థులకు ఈ పరీక్ష నుంచి మినహాయింపునివ్వాలనే బిల్లును ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా నిన్న నీట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. నీట్ పరీక్షపై భయాందోళనతో ఓ విద్యార్థి సేలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ తరుణంలో ఎంకే స్టాలిన్ సారథ్యంలోని తమిళనాడు ప్రభుత్వం ఇది వరకే ప్రకటించినట్టుగా నీట్ పరీక్ష నుంచి తమ రాష్ట్రానికి మినహాయింపునివ్వాలని బిల్లు ప్రవేశపెట్టింది.

నీట్ పరీక్ష ద్వారా జాతీయస్థాయిలో అడర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులకు ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. 2013లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రతిపాదనలు వచ్చినప్పటి నుంచి తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తూనే ఉన్నది. తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్నప్పుడే దీనిపై వ్యతిరేకతను కేంద్రానికి తెలియజేశారు. దీంతో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకే కూడా స్టాలిన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీట్ వ్యతిరేక బిల్లుకు మద్దతునివ్వనుంది. తమిళనాడు ప్రతిపక్ష నేత ఈపీఎస్ ఈ విషయాన్నే వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే నీట్ వ్యతిరేక బిల్లును తాము మద్దతునిస్తామని స్పష్టం చేశారు. 

సామాజిక న్యాయం, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థలకు సమాన అవకాశాలు, వారి హక్కులను రక్షించడానికి ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్టు అధికారవర్గం తెలిపింది. ప్రధాన స్రవంతి విద్యలో బలహీనవర్గాల విద్యార్థుల హక్కులను కాపాడటమే ఈ బిల్లు ఉద్దేశ్యమని వివరించంది. ఈ ఏడాది నీట్ పరీక్షకు తమిళనాడు నుంచి దరఖాస్తులు ఏడు శాతం తగ్గడం గమనార్హం.

click me!