బీజేపీ డబ్బులు ఆఫర్ చేసింది.. కానీ ఒక్క పైసా తీసుకోలే.. నాలుక్కరుచుకున్న బీజేపీ ఎమ్మెల్యే

By telugu teamFirst Published Sep 13, 2021, 1:51 PM IST
Highlights

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీమంత్ పాటిల్ కర్ణాటక రాజకీయాలను కుదిపేసే వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడానికి కమలం పార్టీ తనకు డబ్బులు ఆఫర్ చేసిందని, కానీ, తాను తిరస్కరించారని వ్యాఖ్యానించి నాలుక్కరుచుకున్నారు. మళ్లీ తన వ్యాఖ్యలనే ఖండించుకున్నారు. బీజేపీ తనను ప్రలోభపెట్టలేదని, స్వచ్ఛందంగా పార్టీ మారినట్టు తెలిపారు. ఇంతలో కాంగ్రెస్ విమర్శలు మొదలుపెట్టింది.
 

బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి ఈ పార్టీలోకి మారడానికి కమలం పార్టీ తనకు డబ్బులు ఆఫర్ చేసిందని బీజేపీ ఎమ్మెల్యే, బీఎస్ యడియూరప్ప క్యాబినెట్‌లో మంత్రిగా చేసిన శ్రీమంత్ పాటిల్ అన్నారు. కానీ, తాను ఒక్క పైసా తీసుకోలేదని తెలిపారు. సొంతపార్టీపైనే చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపాయి. వెంటనే కాంగ్రెస బీజేపీపై విమర్శలు చేసింది. పార్టీ ఫిరాయింపుల కోసం బీజేపీ ప్రలోభపెట్టిందని, ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని పోలీసులను కోరింది. 2019లో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం నుంచి బీజేపీలోకి చేరిన 16 మంది ఎమ్మెల్యేలలో పాటిల్ ఒకరు. ఆ దెబ్బతో రాష్ట్రంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత యడియూరప్ప సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.

ఈ వ్యాఖ్యలు సంచలనం కావడంతో ఆయనే మళ్లీ వివరణ ఇచ్చారు. బీజేపీ తనను ప్రలోభపెట్టలేదని, డబ్బులు ఇవ్వజూపలేదని వివరించారు. తన భావాన్ని వ్యక్తపరచడానికి తప్పు పదాలను వాడినట్టు పేర్కొన్నారు. తానే స్వచ్ఛందంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారినట్టు తెలిపారు.

పాటిల్ వ్యాఖ్యలపై కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ వెంటనే స్పందించారు. శ్రీమంత్ పాటిల్ వాస్తవాలు మాట్లాడారని, బీజేపీ ఆయనను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిందని అన్నారు. ఆపరేషన్ ‘కమలం’తో ఆయనను పార్టీ మార్పించారని ఆరోపించారు. ఏసీబీ వెంటనే దీనిపై దర్యాప్తు చేసి దోషులను పట్టుకోవాలని కోరారు.

click me!