
ఉదయనిధి సనాతన వివాదం: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, కేవలం దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా తొలగించాలని ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దూమారం రేగుతోంది. పెద్ద ఎత్తున ఆందోళనలు చేలారేగుతున్నాయి. ప్రధానంగా బీజేపీ, స్టాలిన్ పార్టీపై విమర్శ ప్రతివిమర్శలు సాగుతున్నాయి.
ఈ తరుణంలో ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు. తాను తన ప్రకటనపై నిలబడతానని, పదే పదే రిపీట్ చేస్తానని చెప్పారు. ఎలాంటి కేసులను ఎదుర్కొడానికైనా తాను సిద్దంగా ఉన్నానని అన్నారు. వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని తూత్తుకుడిలో రాష్ట్ర క్రీడల మంత్రి ఉదయనిధి మాట్లాడుతూ.. " నిన్నగాక మొన్న నేను ఓ కార్యక్రమంలో సనాతన ధర్మం గురించి మాట్లాడాను.. ఏం మాట్లాడినా మళ్లీ మళ్లీ చెబుతాను.. అందులో హిందువులనే కాకుండా అన్ని మతాలను చేర్చాను. కులతత్వాన్ని ఖండిస్తూ అలాంటి ప్రకటన చేశాను." అని పేర్కొన్నారు
ఉదయనిధి స్టాలిన్ ప్రకటన ఏమిటి?
శనివారం (సెప్టెంబర్ 2) నాడు చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు ఉదయనిధి. ఆ వ్యాధులను ఎలా నిర్మూలిస్తామో.. సనాతన ధర్మాన్ని కూడా అలానే నిర్మూలించాలని ఆయన పిలుపునిచ్చారు.
బీజేపీ ఫైర్
మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రకటనపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) మండిపడింది. స్టాలిన్‌తో సహా 'ఇండియా' కూటమిపై దాడి చేస్తోంది. హోంమంత్రి అమిత్ షా నుంచి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వరకు పలువురు నేతలు ఉదయనిధి ప్రకటనను తీవ్రంగా విమర్శించారు.
ఉదయనిధి క్షమాపణ చెప్పాలి - రాజ్‌నాథ్ సింగ్
ఉదయనిధి ప్రకటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ డీఎంకే అధినేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని దెబ్బతీశారని అన్నారు. ఇందుకు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే దేశం వారిని క్షమించదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే సమయంలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి కూడా ఉదయనిధి స్టాలిన్‌ను లక్ష్యంగా చేసుకుని, ఇది మానసిక దివాలా అని, సనాతన్ సంప్రదాయాలను అగౌరవపరిచిన వ్యక్తుల మనస్సులలో చూస్తున్నామని అన్నారు. వారి సంప్రదాయాల గురించి వారికి అవగాహన లేదని విమర్శించారు.
సనాతన్ శాశ్వతమైనది - అనురాగ్ ఠాకూర్
అంతే కాకుండా హిందువులను నిర్మూలించాలని కలలు కన్న వారు ఎందరో బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయారని, సనాతన ధర్మం శాశ్వతమైందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. అదే సమయంలో శివసేన నాయకుడు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు, ముంబై జాయింట్ CP కి లేఖ రాశారు.
కాంగ్రెస్ అందరినీ గౌరవిస్తుంది
అదే సమయంలో ఉదయనిధి ప్రకటనపై కాంగ్రెస్ నాయకుడు కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజన్ చాలా స్పష్టంగా ఉంది. అన్ని మతాలను సమానంగా చూస్తామనీ, ప్రతి ఒక్కరి విశ్వాసాలను గౌరవిస్తామని అన్నారు. అయితే.. అన్ని రాజకీయ పార్టీలకు తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉందని అన్నారు.