పబ్లిక్ మీటింగ్ లో NEET గుడ్డును చూపించిన ఉదయనిధి స్టాలిన్‌.. ఎందుకంటే?

By Rajesh KarampooriFirst Published Oct 22, 2023, 2:31 AM IST
Highlights

Udhayanidhi Stalin: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) మరోసారి వార్తల్లో నిలిచారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-NEET) అని రాసి ఉన్న గుడ్డును జనానికి చూపించారు. అసలేం జరిగింది? ఆ గుడ్డును ఎందుకు ప్రదర్శించారు.?

Udhayanidhi Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) మరోసారి వార్తల్లో నిలిచారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పీజీ కట్ ఆఫ్ శాతాన్ని సున్నాకి తగ్గించడంపై ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. ఆయన శనివారం నాడు చైన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో.. సున్నాకి ప్రాతినిధ్యం వహించేలా 'NEET' అని వ్రాసి ఉన్న గుడ్డును ప్రేక్షకులకు చూపించారు. గుడ్డు (ముట్టై) అనే తమిళ పదానికి వ్యావహారికంలో సున్నా అని అర్థం. 

ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. నీట్‌ నుంచి ఎన్‌ఈపీ వరకు విద్యాహక్కులను కాలరాయడానికి ఫాసిస్టులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని, నీట్‌ను నిషేధించాలన్న డిమాండ్‌ను విస్మరిస్తే.. జల్లికట్టు తరహాలో సామూహిక నిరసనలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు నీట్‌కు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ ప్రచారంలో పాల్గొనాలని అన్నాడీఎంకేతో సహా ఇతర పార్టీలకు పిలుపునిచ్చారు.  
 
నీట్‌కు వ్యతిరేకంగా  తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం మెగా సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రారంభించింది. వైద్య పరీక్ష నీట్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు ప్రచారం నిర్వహించి 50 లక్షల సంతకాలను సేకరిస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తొలి సంతకంతో ఈ ప్రచారం ప్రారంభమైంది. ఈ సంతకం ప్రచారంలో భాగంగా ఆన్‌లైన్‌లో, పోస్ట్‌కార్డ్‌ల ద్వారా చేయవచ్చు. సంతకాలన్నింటినీ సేకరించిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపుతామని మంత్రి చెప్పారు. తద్వారా తమిళనాడుకు నీట్‌ను మినహాయించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానించి రాష్ట్రపతికి పంపిన బిల్లుకు ఆమోదం కోసం పట్టుబట్టనున్నారు. 

ఇదిలా ఉంటే.. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఉదయనిధి కేంద్ర ప్రభుత్వ ఎయిమ్స్ మదురై ప్రాజెక్టును టార్గెట్ చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వంపై ఆరోపణలు కూడా వచ్చాయి. ఎన్నికల్లో ఈ అంశాన్ని విపరీతంగా ఉపయోగించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పునాది రాయిపై 'AIIMS' అని రాసి ఉన్న ఎర్రటి ఇటుకను విస్తృతంగా ఉపయోగించారు. ఈ ఫోటో వైరల్‌గా కూడా మారింది.

click me!