
ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ పెట్టి నిద్రించగా.. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి వెలువడిన పొగతో ఊపిరాడక తండ్రీకూతురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన తమిళనాడు వెల్లూరు జిల్లాలోని చిన్న అల్లాపురమ్లో శుక్రవారం రాత్రి జరిగింది. మృతులను ఎం.దురైవర్మ (49), అతని కూతురు మోహన ప్రీతి(13)గా గుర్తించారు. వివరాలు.. వేలూరు జిల్లా చిన్న అల్లాపురం ప్రాంతంలో దురైవర్మ ఓ ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. అతడు కొద్ది రోజుల క్రితం ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేశాడు.
శుక్రవారం రాత్రి ఇంటి ప్రాగంణంలోని పాత సాకెట్‌లో ఎలక్ట్రిక్ బైక్ చార్జర్‌ని అమర్చి నిద్రపోయాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ-బైక్‌కు మంటలు చెలరేగడంతో పాటు పొగలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే బ్యాటరీలో పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగడంతో ఇల్లంతా పొగగా మారింది. పొగ కారణంగా దురైవర్మ, అతని కూతురు ఇంట్లోంచి బయటకు వచ్చే వీలులేకుండా పోయింది. దీంతో వారు ఇంట్లోని బాత్‌రూమ్‌లో తలదాచుకున్నారు. అయితే ఊపిరి ఆడకపోవడంతో మృతిచెందారు.
అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఈ-బైక్‌లో మంటలు, పొగలు వ్యాపించినట్టుగా స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులుకు, అక్కడికి కొన్ని ఇళ్ల దూరంలో ఉండే దురైవర్మ సోదరికి సమాచారం అందించామని చెప్పారు. వేలూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో స్థానికులు ఇంటి ముందు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
అయితే అప్పటికే దురైవర్మ, అతని కూతురు ప్రీతి బాత్‌రూమ్‌లో మృతిచెంది కనిపించారు. వారి వంటిపై కాలిన గాయాలు పెద్దగా లేకపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. తండ్రీకూతుళ్ల మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇక, 2013లో దురైవర్మ భార్య మరణించిందని.. అప్పటి నుంచి అతడు కూతురు, కొడుకుతో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత దురైవర్మ కొడుకు.. దగ్గరి బంధువు ఇంటికి వెళ్లాడు. దీంతో తండ్రీకూతుళ్లు ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నారు. అయితే కూతురు ప్రీతి కూడా తిరువణ్ణామలైలో బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటుందని.. చాలా నెలల తర్వాత తన తండ్రి వద్దకు వచ్చిందని స్థానికులు తెలిపారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.