
Uttar Pradesh: సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ శాసనసభా పక్ష నేతగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులందరితో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ శాసనసభా పక్ష నేతగా అఖిలేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, ప్రతిపక్షనేతను ఎన్నుకునే ప్రక్రియ అసెంబ్లీలోనే జరుగుతుందని, పార్టీ రాసి పంపిస్తుందని, అక్కడే జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పటేల్ అన్నారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామా పత్రాన్ని అందజేసి యాదవ్ ఇప్పటికే లోక్‌సభకు రాజీనామా చేశారు. ఆయన లోక్‌సభకు అజంగఢ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో కర్హాల్ అసెంబ్లీ స్థానం నుండి గెలిచిన తరువాత SP నాయకుడు దిగువ సభకు రాజీనామా చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అయితే, ప్రస్తుతం అఖిలేష్ యాదవ్, ఎస్పీకి చెందిన ఆజంఖాన్‌ల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో ఆ పార్టీ బలం మూడుకు తగ్గనుంది.
ఇక ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికలలో, సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలను కైవసం చేసుకుంది, ఇది 2017లో 47 స్థానాల నుండి భారీగా పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లో 250 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఇక కాంగ్రెస్, బీఎస్పీలు దారుణ ఫలితాలు రాబట్టాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయంతో యోగి ఆదిత్యానాధ్ సీఎంగా రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలందరూ హాజరయ్యారు.
మీటింగ్‌కు శివపాల్‌ను ఆహ్వానించని అఖిలేష్
ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆయన బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ మధ్య మళ్లీ దూరం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ముందుకు సాగారు. ఇద్దరు నేతలు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, ప్రతిపక్ష నేతగా ఎన్నుకునే కీలకమైన సమావేశానికి తనను పిలువలేదని శివపాల్ సింగ్ యాదవ్ అన్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తాను అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవడంతోపాటు రెండు రోజులుగా ఎదురుచూసినట్లు ఆయన తెలిపారు. తాను ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీలో కలిసి ముందుకు సాగిన విషయాలను గుర్తు చేశారు.