
దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ రమ్మీ , జూదం పెద్ద సమస్యగా మారాయి. వీటికి బానిసై ఎంతో మంది యువకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇదిలా ఉండగా.. గత ఏడాది అక్టోబర్ 1న ఆన్‌లైన్ రమ్మీని నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం అత్యవసర చట్టాన్ని రూపొందించి గవర్నర్‌కు పంపింది. అదే రోజు ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం గతేడాది అక్టోబరు 19న ఆన్‌లైన్‌లో జూదమాడడాన్ని వ్యతిరేకిస్తూ, నిషేధిస్తూ శాసనసభలో బిల్లును దాఖలు చేసి ఆమోదించారు. అయితే ఆర్డినెన్స్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగిన రోజు నుంచి ఆర్డినెన్స్ 6 వారాలు ముగుస్తుంది. దీని ప్రకారం ఆన్‌లైన్ రమ్మీని నిషేధిస్తూ ఆర్డినెన్స్ రద్దయింది.
ఈక్రమంలో తమిళనాడు అసెంబ్లీ బిల్లు పంపితే.. రాజ్‌భవన్(గవర్నర్) తమిళనాడు శాసనసభకు పునఃపరిశీలన కోసం తిరిగి పంపింది. ఈ మేరకు బుధవారం అధికారిక వర్గాలు వెల్లడించాయి. రాజ్ భవన్ హైలైట్ చేసిన కొన్ని అంశాల దృష్ట్యా బిల్లును "పునః పరిశీలన" కోసం తిరిగి సభకు పంపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
అక్టోబర్ 1, 2022న గవర్నర్ ఒక ఆర్డినెన్స్ (ఆన్‌లైన్ జూదం, పందెం ఆధారిత ఆన్‌లైన్ గేమ్‌ల రమ్మీ , పోకర్‌లను నిషేధించడం)ని ప్రకటించారు. అక్టోబర్ 3న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తమిళనాడు శాసనసభ అక్టోబర్ 17న సమావేశమైంది. గత ఏడాది సంక్షిప్త సమావేశానికి మరో బిల్లును ఆమోదించారు.
సైబర్‌స్పేస్‌లో జూదం లేదా బెట్టింగ్‌ను నిషేధించిన తమిళనాడు గేమింగ్ అండ్ పోలీస్ లాస్ (సవరణ) చట్టం 2021లోని నిబంధనలను ఆగస్ట్ 3, 2021న మద్రాస్ హైకోర్టు కొట్టివేసిన తర్వాత బిల్లును ఆమోదించడం తప్పనిసరి అయింది. ఇటువంటి నిబంధనలను హైకోర్టు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం బెట్టింగ్‌లు, గ్యాంబ్లింగ్‌ల విషయంలో ప్రభుత్వం తగిన చట్టాలను ఆమోదించవచ్చని కోర్టు పేర్కొంది. ఆన్‌లైన్ రమ్మీని నిషేధించే బిల్లుకు శాశ్వత చట్టాన్ని గవర్నర్ ఆమోదించకపోగా, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను ఎందుకు నిషేధించాలి, ఈ చట్టాన్ని ఎందుకు అమలు చేయాలి అనే దానిపై వివరణ ఇవ్వాలని గవర్నర్ కోరారు.
బిల్లు ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపగా, దానిని క్లియర్ చేయాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవిని ప్రభుత్వం పదే పదే కోరింది. రాజ్ భవన్ బిల్లును వాపస్ చేయడంతో తమిళనాడు ప్రభుత్వం అవసరమైన మార్పులతో కూడిన మరో బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై సూచించారు. ఈ ముసాయిదాతో బిల్లును సుప్రీంకోర్టు లేదా కేంద్రం కొట్టివేసే అవకాశం ఉందని అన్నామలై అన్నారు.
గవర్నర్ ఏ ప్రాతిపదికన బిల్లును వాపస్ చేశారో ప్రజలకు తెలియజేయాలని, తద్వారా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని ఆయన అన్నారు. ఆన్‌లైన్ రమ్మీకి బీజేపీ కూడా వ్యతిరేకమని, దీనికి సంబంధించి గవర్నర్‌కు రెండు వినతులు సమర్పించామని అన్నామలై తెలిపారు. 234 మంది ఎమ్మెల్యేలు కూర్చుని సమస్యపై చర్చించి ప్రభుత్వం నుంచి ఆమోదం పొందేందుకు మరో బిల్లు తీసుకురావాలని అన్నామలై అన్నారు.
కొనసాగుతున్న ఆత్మహత్యలు:
ఆన్‌లైన్ బిల్లును నిషేధించాలని పలు పార్టీలు పట్టుబడుతున్నారు. ఆన్‌లైన్ రమ్మీ కారణంగా తమిళనాడులో ఇప్పటి వరకు 44 మంది ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆన్‌లైన్ రమ్మీ బ్యాన్ బిల్లును గవర్నర్ వెనక్కి పంపడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. తాజాగా ఆన్‌లైన్‌లో రమ్మీ నిషేధ బిల్లును గవర్నర్ వాపస్ చేయడంతో మరోసారి వివాదం తెరపైకి వచ్చింది.