M.K. Stalin Speaking for India Podcast: బీజేపీ ప్రభుత్వం ఫెడరలిజాన్ని, రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మోడీ రాష్ట్ర హక్కుల కోసం గళమెత్తారు.. కానీ ప్రధాని అయ్యాక తన వైఖరిని మార్చుకున్నారని విమర్శించారు.
DMK president and Tamil Nadu CM MK.Stalin: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఫెడరలిజాన్ని, రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఆయన 'స్పీకింగ్ ఫర్ ఇండియా' అనే పేరుతో నిర్వహిస్తున్న పోడ్‌కాస్ట్ తాజా ఎపిసోడ్ లో మాట్లాడుతూ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోడీ రాష్ట్ర హక్కుల కోసం గళమెత్తారు.. కానీ ప్రధాని అయ్యాక తన వైఖరిని మార్చుకున్నారనీ, ఇప్పుడు రాజ్యాంగం మొదటి లైన్ ఆయనకు నచ్చడం లేదని విమర్శించారు. భారతదేశం, అంటే భారత్, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుందని స్టాలిన్ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని నొక్కిచెప్పారు.
ఈ పాడ్ కాస్ట్ ను ఇక్కడ వినవచ్చు
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటున్న తీరును ప్రశ్నిస్తూ.. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 'స్పీకింగ్ ఫర్ ఇండియా' శీర్షికతో వరుస పోడ్‌కాస్ట్ లు విడుదల చేస్తున్నారు. తమిళం, ఇంగ్లీష్ తో పాటు వివిధ భారతీయ భాషల్లో ఈ పోడ్‌కాస్ట్ అనువదించి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా పోడ్‌కాస్ట్ లో ఎంకే స్టాలిన్ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని గురించి ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటున్న తీరును ప్రశ్నించారు. రాష్ట్రాల హక్కులు అనే తన పోడ్‌కాస్ట్ అంశం గురించి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 'రాష్ట్రాల మొత్తం పరిపాలనను గవర్నర్ల భవనాలకు బదలాయించిందని విమర్శించారు. తమిళనాడు పరిస్థితులను ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ప్రజాప్రతినిధులంతా కలిసి శాసనసభలో ఆమోదించిన 19 బిల్లుల ఆమోదాన్ని ఆపేందుకు గవర్నర్ ను ఉపయోగించుకుంటోందని విమర్శించారు.
రాష్ట్రాల హక్కులు, ప్రస్తుతం కేంద్రంలోని ప్రభుత్వం నడుచుకుంటున్న తీరును ప్రశ్నిస్తూ.. అనేక ఉదాహరణలను ప్రస్తావించారు. "ఢిల్లీ నుండి కేంద్రీకృతంగా లేకుండా రాష్ట్రాలకు అనేక కార్యక్రమాలను ప్లాన్ చేస్తామని ప్రధాని హామీనిచ్చారు.. అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రులు పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజేయగల ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, బదులుగా 'నీతి ఆయోగ్'ని సృష్టించారని ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోయడం గురించి ప్రస్తావిస్తూ.. స్థానిక పార్టీలను విచ్ఛిన్నం చేసి ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తోందనీ, ఇది ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతీకార చర్యగా ఆయన అభిర్ణించారు.
జీఎస్టీ అమలు తీరును కూడా ఎంకే స్టాలిన్ ప్రశ్నిస్తూ పలు విమర్శలు గుప్పించారు. "రాష్ట్ర ప్రభుత్వాలకు మరిన్ని ఆర్థిక అధికారాలు కల్పిస్తామని ప్రధాని మోడీ చెప్పారు. కానీ జీఎస్టీకి పరిహారం గడువు పొడిగించలేదు. రాష్ట్ర వాటా కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే జీఎస్టీ వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారి, రాష్ట్రాలు ఐసీయూలో ఉన్నాయి" అని స్టాలిన్ పేర్కొన్నారు. తన పోడ్‌కాస్ట్ లో జాతీయ విద్యా విధానం, ఫెడరలిజం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జాతీయ విద్యా విధానం, ఫెడరలిజం అంశాలను గురించి మాట్లాడుతూ.. బీజేపీ ఒకే పార్టీ, ఒకే నాయకత్వం, ఏక శక్తితో ఒకే ప్రధాన మంత్రి వైపు వెళ్తోందని పేర్కొంటూ.. ఈ ధోరణి ను ముక్కలు చేసి నాశనం చేస్తుందని హెచ్చరించారు.
స్టాలిన్ తన పోడ్‌కాస్ట్ చివరలో.. మరోసారి రాష్ట్రాల స్వయంప్రతిపత్తి, రాజ్యాంగం కల్పించిన రక్షణల గురించి ప్రస్తావించారు. రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తిని డిమాండ్ చేస్తూ.. ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి ఎన్నికైతే, రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాపాడుతుందనీ, ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.