
Clashes Between Congress Leaders: తమిళనాడు రాజధాని చెన్నైలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం (నవంబర్ 15) రాత్రి రెండు గ్రూపుల మధ్య తోపులాట జరిగింది. తోపులాట బాగా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఆ ఘర్షనలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. భారత్ జోడో యాత్ర అనంతరం నియోజకవర్గాల్లో పార్టీ జెండాలను ఎగురవేయడంపై చర్చ సందర్భంగా ఈ రచ్చ చోటుచేసుకుంది. టీఎన్‌సీసీ కోశాధికారి, నంగునేరి ఎమ్మెల్యే రూబీ ఆర్ మనోహరన్ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి ఎదుట ఇరువర్గాలు వాగ్వాదానికి దిగారు. తోపులాట జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి జనాన్ని చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ ఘర్షణలో పలువురు పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. అయితే పార్టీ ఇంకా పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేయలేదు.
ఎందుకీ గొడవ..?
టీఎన్‌సీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ కార్యదర్శులు, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో అళగిరి సమావేశమై పార్లమెంట్ ఎన్నికలు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా స్తంభాల ఏర్పాటుపై చర్చించారు. అంతకుముందు కాంగ్రెస్‌కు చెందిన కలక్కాడ్, నంగునేరి రెండు బ్లాక్ అధ్యక్షులు ఎన్నికల ఫలితాలు వెల్లడికావడంతో ఆగ్రహించిన మనోహరన్ మద్దతుదారులు బస్సుల్లో పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ వాగ్వాదం చోటుచేసుకుందని సమాచారం. కాగా, రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటన తర్వాత ఇప్పుడు చాలా మంది నాయకుల మధ్య వైరం వార్తలు తెరపైకి వస్తున్నాయి.
2024 లోక్‌సభ ఎన్నికలకు వ్యూహాలు రచించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి హాజరయ్యారు. సమావేశం నుంచి బయటకు రాగానే అళగిరి కారును అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నప్పటికీ, ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సమావేశానికి అంతరాయం కలిగించేందుకే ప్రజలను బస్సుల్లో తీసుకొచ్చారని సమావేశంలో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు తెలిపారు. అళగిరి కారును అడ్డుకుని నినాదాలు చేసిన కొందరు పార్టీ సభ్యులు కూడా కాదని ఆయన పేర్కొన్నారు. తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకుంటామని పార్టీ నేతలు హామీ ఇచ్చినప్పటికీ, అంతరాయం కలిగించిన వారు అక్కడి నుంచి వెళ్లలేదనీ, పోలీసుల సహాయం కోరాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర..
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభమై రాష్ట్రం యాత్రను ముగించుకుంది. ఈ క్రమంలోనే అక్కడి నాయకులు ప్రజల్లోకి వెళ్లడానికి చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అంతర్గత గొడవలు మళ్లీ తెరపైకి వస్తుండటంపై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్ జోడో ముందు తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్రను ముగించుకుని మహారాష్ట్రకు చేరుకున్నారు. త్వరలోనే భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించనుంది.