తమిళనాడు నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో (tamil nadu chopper crash) ప్రాణాలు కోల్పోయినవారి భౌతికకాయాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా లాన్స్ నాయక్ (Lance Naik Sai Teja) తో పాటుగా మరో ఐదుగురి భౌతికకాయాలను అధికారులు గుర్తించారు.
తమిళనాడు నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో (tamil nadu chopper crash) ప్రాణాలు కోల్పోయినవారి భౌతికకాయాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రమాదం జరిగిన తర్వాత వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. కేవలం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat), ఆయన సతీమణి మధులికా రావత్, బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిద్దర్ భౌతికకాయాలను మాత్రమే గుర్తించారు. దీంతో శుక్రవారం వారి అంత్యక్రియలు ఢిల్లీలోని బరార్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. మిగిలిన వారి మృతదేహాలను ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో ఉంచారు. డీఎన్‌ఏ పరీక్షలు, కుటుంబ సభ్యుల సాయంతో మృతదేహాల గర్తింపు ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలోనే మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించినట్టుగా భారత సైన్యం వెల్లడించింది. ఇందులో ఇద్దరు ఆర్మీకి చెందినవారు కాగా, నలుగురు వాయుసేనకు చెందినవారు ఉన్నారు. మరో నలుగురి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని.. వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేస్తామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
తాజాగా గుర్తించినవారిలో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా (Chittoor district) ఎగువరేగడకు చెందిన లాన్స్ నాయక్ (Lance Naik Sai Teja) భౌతికకాయం కూడా ఉంది. ఇక, గుర్తించిన ఆరుగురి భౌతికకాయాలను నేడు కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టుగా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భౌతికకాయాలను విమానాల్లో స్వస్థలాలకు తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టుగా తెలిపాయి.
undefined
తాజాగా గుర్తించిన వారి వివరాలు..
వింగ్ కమాండర్ పీఎస్ చౌహన్ భౌతికకాయాన్ని ఉదయం 9.45 గంటల వరకు ఆగ్రాకు తరలించనున్నారు.
జూనియర్ వారెంట్ ఆఫీసర్ ప్రదీప్ అరక్కల్ భౌతికకాయాన్ని ఉదయం 11 గంటల వరకు సులూరుకు తరలించనున్నారు.
స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్ భౌతికకాయాన్ని ఉదయం 11.45 గంటల వరకు పిలాని తరలించనున్నారు.
జూనియర్ వారెంట్ ఆఫీసర్ రాణా ప్రతాప్ దాస్ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 1 గంట వరకు భువనేశ్వర్ తరలించనున్నారు.
లాన్స్ నాయక్ సాయితేజ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12.30 గంటల వరకు బెంగళూరుకు తరలించనున్నారు.
లాన్స్ నాయక్ వివేక్ కుమార్ భౌతికకాయాన్ని ఉదయం 11.30 గంటల వరకు గగ్గల్‌కు తరలించనున్నారు.
నేడు స్వస్థలానికి సాయితేజ భౌతికకాయం..
చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన సాయితేజ భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. నేడు మధ్యాహ్నం విమానంలో సాయితేజ భౌతికకాయాన్ని బెంగళూరుకు తరలిస్తారు. అక్కడి నుంచి సాయితేజ స్వగ్రామమైన ఎగువరేగడకు తీసుకువస్తారు. అయితే సాయితేజ భౌతికకాయం వీలైనంత త్వరగా చేరుకుంటే నేడు అంత్యక్రియలు జరపనున్నారు. అయితే మృతదేహం తరలింపులో ఆలస్యం జరిగితే.. రేపు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇక, సాయితేజ మరణం అతని కుటుంబంలో తీవ్ర శోకాన్ని నింపింది. ఈ ప్రమాద వార్త తెలిసినప్పటీ నుంచి కుటుంబ సభ్యులు కన్నీరుమన్నీరుగా విలపిస్తూనే ఉన్నారు.
ఇక, ఎగువరేగడలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన మోహన్, భువనేశ్వరి దంపతులకు సాయితేజ, మహేష్‌బాబు సంతానం. సాయితేజ స్థానికంగానే చదువుకున్నారు. 10వ తరగతి పూర్తి కాగానే దేశానికి సేవ చేయాలనే తపనతో సైన్యంలో చేరారు. డిగ్రీ పూర్తి చేసి గుంటూరులో జరిగిన ఆర్మీ సెలక్షన్స్‌కు హజరై 2012లో సైనికుడిగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పారా కమెండో పరీక్ష రాసి ఉత్తీర్ణతతో 11వ పారా లాన్స్ నాయక్ హోదా దక్కించుకున్నాడు. ఏడు నెలల క్రితమే జనరల్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా (PSO to the CDS) నియమితులయ్యారు. సాయితేజ సోదరుడు మహేష్‌బాబు కూడా సైన్యంలోనే ఉన్నారు.
సాయితేజకు భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు మోక్షజ్ఞ (5), దర్శిని (2) ఉన్నారు. అయితే కొద్ది నెలల క్రితమే సాయితేజ.. తన కొడుకు మోక్షజ్ఞ ప్రాథమిక విద్య కోసం గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలోని మదనపల్లె పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీకి తన భార్యాపిల్లలను మార్చారు. చివరి సారిగా వినాయకచవితికి సాయితేజ ఇంటికి వచ్చారు. జనవరిలో సంక్రాంతి పండగకు వస్తానని కుటుంబ సభ్యులతో తెలిపారు. సాయితేజ రోజు భార్య, పిల్లలతో ఫోన్‌లో మాట్లాడేవారు. బుధవారం కూడా సాయితేజ.. భార్యకు వీడియో కాల్ చేశారు.
ఇక, సాయి తేజ మృతిచెందారనే వార్త తెలియడంతో అతని స్వగ్రామం రేగడపల్లెలో విషాదఛాయలు నెలకొన్నాయి. సాయితేజ తల్లిదండ్రులు, భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బంధువులు, స్నేహితులు సాయితేజతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు.