
AIADMK leader Edappadi Palaniswami: రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర నాయకత్వం చెప్పిందని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) సోమవారం అన్నారు. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇంకా ఒప్పందాలు ఖరారు చేయలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చెప్పిన మరుసటి రోజే ఈపీఎస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
సోమవారం నాడు ఏఐఏడీఎంకే ఎడప్పాడి పళనిస్వామి మీడియాతో మాట్లాడుతూ.. రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని బీజేపీ అగ్రనాయకత్వం చెప్పందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమతో చర్చలు జరుపుతున్నారన్నారు. పొత్తును నిర్ణయించేది కేంద్ర నాయకులే తప్ప రాష్ట్రంలోని వారు కాదన్నారు. ఇక్కడి (తమిళనాడు) నాయకులు కూడా పొత్తుపై తమ కేంద్ర నాయకులే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పొత్తుల విషయాలను తాము రాష్ట్ర నాయకులతో కాకుండా నేరుగా కేంద్ర నాయకత్వంతో చర్చించామని ఆయన అన్నారు.
ప్రస్తుతానికి రెండు పార్టీలు మిత్రపక్షాలేననీ, అయితే 2024 సార్వత్రిక ఎన్నికలకు తమ భాగస్వామ్యం ఖరారు కాలేదని ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా చేసిన వ్యాఖ్యల్లో సూక్ష్మాంశాలు కనిపిస్తున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఈపీఎస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తుపై అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానమిచ్చారు. కాగా, జయలలిత ఏఐఏడీఎంకేకు నాయకత్వం వహించినప్పుడు బీజేపీ కేంద్ర నేతలు కూడా పొత్తుపై నేరుగా తమతో మాట్లాడారని ఈపీఎస్ తెలిపారు.
అన్నామలై వ్యాఖ్యలను బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ తిప్పికొట్టారు. ఈ విషయంపై అమిత్ షాతో చర్చించానన్నారు. 'ప్రస్తుతానికి మేం కూటమిలోనే ఉన్నాం. అయితే ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. 2024 ఎన్నికల సమీకరణాలపై ఇప్పుడే ఎలా నిర్ణయం తీసుకుంటాం? అని పేర్కొన్నారు.