
Swedish tennis legend Bjorn Borg: జీవితంలో సమయ పాలన అనేది చాలా ముఖ్యం.. ఎంతో మంది ప్రముఖులు ఇదే విషయం తమ విజయాలకు ప్రధాన కారణమని చెప్పుకోవడం చూస్తుంటాము. అయితే, పలువురు భారతీయ సెలబ్రిటీలు, ముఖ్యంగా రాజకీయ నాయకులు సమయపాలన విషయంలో అపఖ్యాతి పాలయ్యారు. అనేక కార్యక్రమాలు, సభలు వంటి వాటికి ఆలస్యంగా రావాడానికి ఒక్కోసారి వారికి ఇబ్బందులు తెచ్చిపెట్టడంతో పాటు వారికి చేదు అనుభవాన్ని ఎదురయ్యేలా చేస్తుంది. తాజాగా కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి సైతం ఇదే తరహా పరాభవం ఎదురైంది. షెడ్యూల్ కంటే గంటన్నర ఆలస్యంగా కార్యక్రమం జరగడంతో స్వీడన్ టెన్నిస్ దిగ్గజం జోర్న్ బోర్గ్ తనకు సన్మానం చేయడానికి సున్నితంగా నిరాకరించారు.
11 సార్లు గ్రాండ్ స్లామ్ విజేత జోర్న్ బోర్గ్, భారత మాజీ స్టార్ విజయ్ అమృత్ రాజ్ ను సన్మానించేందుకు కర్ణాటక రాష్ట్ర లాన్ టెన్నిస్ అసోసియేషన్ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది, అయితే బొమ్మై మంగళవారం ఆలస్యంగా ఇక్కడికి రావడంతో అది ప్రారంభం కాలేదు. 27 ఏళ్ల వయసులో ఆటకు వీడ్కోలు పలికిన బోర్గ్, కేఎస్ఎల్టీఏలో జరుగుతున్న బెంగళూరు ఓపెన్ మెయిన్ డ్రా కోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న తన కుమారుడు లియోతో కలిసి నగరానికి వచ్చాడు. ఉదయం 9.30 గంటలకు జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని ఆలస్యంగా వస్తున్న బొమ్మైని కూర్చోబెట్టేందుకు చివరి నిమిషంలో 10.15 గంటలకు వాయిదా వేశారు. లియో తన మొదటి రౌండ్ మ్యాచ్ కోసం ఉదయం 11.00 గంటలకు కోర్టుకు రావడం, ఇంకా బొమ్మై కనిపించకపోవడంతో, తన కుమారుడి ఆటను చూడటానికి స్టాండ్లలో కూర్చున్న బోర్గ్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, బొమ్మై చివరకు ఉదయం 11.15 గంటలకు చేరుకున్నారు.
కాగా, ముఖ్యమంత్రి తన ఇతర కమిట్మెంట్ల కారణంగా ఆలస్యమయ్యారని ఆర్గనైజింగ్ కమిటీకి చెందిన ఓ అధికారి తెలిపారు. బోర్గ్ తన కుమారుడి ఆటను చూస్తారని, సన్మానానికి హాజరు కాలేరని మేము ఆయనకు (సీఎం) తెలియజేశామని అన్నారు.