
తమిళనాడులో కృష్ణగిరిలో జవాన్ ఎం ప్రభు హత్యను ఖండిస్తూ ఆ రాష్ట్ర బీజేపీ యూనిట్ మంగళవారం చెన్నైలో పెద్ద ఎత్తున నిరసనకు దిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై ఆధ్వర్యంలో ఒకరోజు నిరహారదీక్షకు దిగారు. వార్ మెమోరియల్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. లాన్స్ నాయక్ ఎం ప్రభు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ కార్యక్రమంలోనే బ్రిగేడియర్ ఎన్‌ఎల్ నారాయణన్‌తో సహా భారత సాయుధ దళాల అనుభవజ్ఞులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభు కుటుంబానికి బీజేపీ తరపున 10 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించిన కె అన్నామలై.. ఆయన ఇద్దరు పిల్లల చదువు ఖర్చులను పార్టీ భరిస్తుందని చెప్పారు. ప్రభు కుటుంబానికి రూ. 5 కోట్లు పరిహారం, మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని మాజీ సైనికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారని అన్నామలై తెలిపారు.
ఆ తర్వాత విలేకరులతో మాట్లాడిన అన్నామలై.. 29 ఏళ్ల ప్రభును డీఎంకే కార్యకర్త చిన్నస్వామి, అతని సహాయకులు హత్యచేశారని ఆరోపించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి తెచ్చిన తర్వాతనే పరారీలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ‘‘మన దేశ సేవలో తమ జీవితాలను గడిపిన భారత సాయుధ దళాల అనుభవజ్ఞులతో పాటు తమిళనాడు బీజేపీ సోదరులు, సోదరీమణులు.. డీఎంకే కౌన్సిలర్ చేతిలో దారుణ హత్యకు గురైన లాన్స్ నాయక్ ప్రభు కుటుంబానికి సంఘీభావంగా ఒకరోజు నిరాహార దీక్షకు కూర్చున్నారు. తప్పుడు పాలన చేస్తున్న డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతిని తెలియజేసేందుకు బీజేపీ కార్యకర్తలు, తమిళనాడు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. క్యాండిల్ మార్చ్‌లో పాల్గొన్నారు. డీఎంకే ప్రభుత్వం తమిళనాడును చట్టరహిత రాష్ట్రంగా మారుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి సమస్యల నుంచి ప్రజలను తప్పుదారి పట్టించడంలో బిజీగా ఉన్నారు. లాన్స్ నాయక్ ప్రభు మరణంపై డీఎంకే మౌనం పాటించడం దురదృష్టకరం.
సరిహద్దుల్లో కాపలాగా ఉన్న వ్యక్తులపై, అవసరమైన సమయాల్లో వారికి అండగా నిలిచే వ్యక్తులపై దాడులు జరుగుతున్నాయి. తమిళనాడు పోలీసులు డీఎంకే ప్రభుత్వ అరాచకానికి మూగ ప్రేక్షకుడిగా కొనసాగుతున్నారు. తమిళనాడు బీజేపీ సభ్యులు సహకారం అందించి రూ. 10 లక్షల చెక్కును లాన్స్ నాయక్ ప్రభు భార్యకు అందజేస్తారు. అతని ఇద్దరు పిల్లల చదువు కూడా పూర్తిగా చూసుకుంటారు’’ అని అన్నామలై ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
కృష్ణగిరికి చెందిన ప్రభాకరన్ అతని సోదరుడు ప్రభు సైన్యంలో పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన చిన్నస్వామి నాగరసంబట్టి మున్సిపాలిటీలోని 1వ వార్డ్ డీఎంకే కౌన్సిలర్. ఫిబ్రవరి 8వ తేదీన చిన్నస్వామి, ప్రభాకరన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ తారాస్థాయికి చేరడంతో చిన్న స్వామి తన కుమారులు గురు సూర్యమూర్తి, గుణనిధి, రాజపాండియన్ తదితరులతో కలిసి ప్రభాకరన్, అతని సోదరుడు ప్రభు వీరి తండ్రిపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో ప్రభు ప్రాణాలు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ప్రభుని హోసూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి 15న ప్రభు మరణించాడు.