
ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా తీర ప్రాంతంలో అనుమనిత గూఢచర్య పావురం పట్టుబడింది. ఆ పావురం కాళ్లకు కెమెరా, మైక్రోచిప్ వంటి పరికరాలు అమర్చి ఉన్నాయి. పారాదీప్ తీరంలో ఈ పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు. పావురం రెక్కలపై అర్థం కాని భాషలో ఏదో రాసి ఉంది. ఈ నేపథ్యంలోనే పక్షిని గూఢచర్యానికి ఉపయోగిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు.. కొన్ని రోజుల క్రితం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులు తమ ట్రాలర్‌పై పావురం కూర్చున్నట్లు గుర్తించారు. పక్షిని పట్టుకుని మెరైన్ పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనను పోలీసులు కూడా ధ్రువీకరించారు. ‘‘పశువైద్యులు పక్షిని పరీక్షిస్తారు. దాని కాళ్ళకు అమర్చిన పరికరాలను పరిశీలించడానికి మేము రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీని ఆశ్రయిస్తాం. పరికరాలు కెమెరా, మైక్రోచిప్ అని తెలుస్తోంది’’ అని జగత్‌సింగ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ పీఆర్ తెలిపారు. స్థానిక పోలీసులకు తెలియని భాషలో పక్షి రెక్కలపై ఏదో రాసినట్లు కూడా కనిపిస్తుందని చెప్పారు. ఏం రాశారో తెలుసుకోవడానికి నిపుణుల సహాయం కూడా తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
ఫిషింగ్ ట్రాలర్ సారథి ఉద్యోగి పీతాంబర్ బెహెరా మాట్లాడుతూ.. పడవపై పావురాన్ని తాను చూశానని చెప్పారు. పక్షి కాళ్ళకు కొన్ని పరికరాలు తగిలించి ఉండటం గమనించానని తెలిపారు. పావురం రెక్కలపై ఏదో రాసి ఉన్నట్లు కూడా కనుగొన్నానని.. అయితే అది ఒడియాలో లేనందున తనకు అర్థం కాలేదని చెప్పారు. పక్షి దగ్గరికి రాగానే పట్టుకున్నానని చెప్పారు.