
Groom flees from bride: కారు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోవడంతో పెళ్లి జరిగిన మరుసటి రోజే వధువు పక్కన ఉన్నా పట్టించుకోకుండా వరుడు అక్కడి నుంచి పారిపోయాడు. వధువు సైతం వరుడి వెంట పరుగులు పెడుతూ ఆగమని పిలుస్తున్నా వినిపించుకోలేదు. ఈ విచిత్ర ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న వారు ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించి అసలు ట్విస్ట్ మాములుగా లేదు.. సినిమాలో కనిపించే విధంగా రియల్ లైఫ్ సీన్ రిపీట్ అయింది.. !
వివరాల్లోకెళ్తే.. పెండ్లి జరిగిన తర్వాతి రోజు వరుడు, వధువు ప్రయాణిస్తున్న కారు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంది. ఈ క్రమంలోనే వధువును విడిచిపెట్టి వరుడు కారు దిగి పారిపోయాడు. ఈ విచిత్ర ఘటన బెంగళూరులోని మహదేవపురాలోని టెక్ కారిడార్‌లో ప్రాంతంలో చోటుచేసుకుంది. పారిపోయిన వరుడి కోసం రెండు వారాలకు పైగా వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఏక్కడకు వెళ్లాడనే విషయం తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మార్చి 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది.
చిక్కబళ్లాపూర్ జిల్లా చింతామణికి చెందిన వరుడు.. వధువు తండ్రికి కొంత కాలంగా అతని పనిలో సాయంగా ఉంటున్నాడు. కర్ణాటక , గోవాలో అతను ఒక ఏజెన్సీ నడుపుతున్నాడు. గోవాలో కంపెనీ డ్రైవర్లలో ఒక వ్యక్తి భార్యతో వరుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె అప్పటికే పెళ్లి అయింది. ఈ విషయం కాస్త వరుడి ఇంట్లో తెలిసింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆ వ్యక్తికి పెండ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. వధువుకు ఈ వివరాలు అన్ని చెప్పిన తర్వాత ఓకే అంటే పెండ్లి జరిపించారు. అయితే, వివాహం జరిగిన వెంటనే ఫిబ్రవరి 15న జార్జ్ తన మాజీ ప్రియురాలు తనను బ్లాక్ మెయిల్ చేస్తోందనీ, తాము ఏకాంతంగా ఉన్న వీడియోలు, ఫొటోలను సోషల్ బయటపెడుతానంటూ బెదిరిస్తోందని కుటుంబ సభ్యులకు చెప్పగా, తాను, తన తల్లిదండ్రులు ఇద్దరూ అతనికి అండగా ఉంటామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వధువు తెలిపింది.
కానీ, చివరకు వరుడు పెండ్లి జరిగిన వెంటనే వధువును విడిచిపెట్టి పారిపోయాడు. "పెళ్లికి ముందే ఈ వ్యవహారం గురించి నాకు తెలిసింది. అతను ఈ విషయాన్ని వదిలిపెడతాననీ, ప్రియురాలికి దూరంగా ఉంటానని హామీ ఇవ్వడంతో నేను అతనిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాను" అని వధువు తెలిపింది.