లక్ష్మణ రేఖ హద్దు తెలుసు.. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ పై సుప్రీంకోర్టు విచారణ

By Mahesh KFirst Published Oct 12, 2022, 8:21 PM IST
Highlights

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది. నవంబర్ 9న రాజ్యాంగ ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. ఇందుకోసం అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్రం,ఆర్బీఐలను ఆదేశించింది.
 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ప్రక్రియపై సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ అంశాన్ని విచారణకు తీసుకుంది. ఈ సందర్భంగా తమకు లక్ష్మణ రేఖ హద్దు తెలుసు అని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చింది.

2016 నవంబర్ 8వ తేదీన కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు అంటే రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసింది. ఆకస్మికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ మేరకు జస్టిస్ ఎస్ ఏ నజీర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కోర్టుకు ఉన్నదని వివరించింది. 

పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన చట్టాన్ని సరైన దృక్పథంలో సవాలు చేయకుంటే అది కేవలం అకడమిక్‌గానే మిగిలిపోతుందని అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రమణి తెలిపారు.

ఇది అకడమికా? పనికిరానిదా? లేక న్యాయ సమీక్ష పరిధిలో లేనిదా అనే విషయాలను చెప్పడానికి ముందు వాదనలు వినాల్సి ఉంటుందని ధర్మాసంన తెలిపింది. కేంద్ర ప్రభుత్వ విధానం, దాని ఆలోచనలు ఈ అంశానికి ఒక వైపు ఉన్నదని వివరించింది. తమకు లక్ష్మణ రేఖ హద్దు ఎక్కడ ఉన్నదో తమకు ఎప్పుడూ ఎరుకలోనే ఉంటుందని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, ఏఎస్ బోపన్నా, వీ రామసుబ్రమణియన్, బీవీ నాగరత్నలు కూడా ఉన్న ధర్మాసనం తెలిపింది. అయితే, ఆ నిర్ణయ అమలు ఏ విధంగా జరిగిందనే విషయాన్ని మాత్రం పరీక్షిస్తామని వివరించింది. అందుకోసం కౌన్సెల్ వాదనలు వినడానికే నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

Also Read: నోట్ల రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ పిటిషన్లు.. రేపు సుప్రీం కోర్టులో విచారణ..

పెద్ద నోట్ల రద్దు విషయమై సుమారు 60 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను నవంబర్ 9వ తేదీన రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ఇందుకోసం పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి చేసిన కసరత్తు, ఇతర వివరాలతో అఫిడవిట్లు సమర్పించాలని కేంద్రం, ఆర్బీఐని బుధవారం ఆదేశించింది.

click me!