
పోలీసు అధికారి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను యాక్సెస్ చేయడంతో పాటు.. వెరిఫికేషన్ కోసం పాస్‌పోర్ట్ బ్రాంచ్‌కు వచ్చిన దరఖాస్తులను క్లియర్ చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. పాస్‌పోర్ట్ బ్రాంచ్‌లో ముంబై పోలీసు అధికారి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ యాక్సెస్ చేసిన నిందితుడు.. పాస్‌పోర్ట్ బ్రాంచ్ వెరిఫికేషన్ సిస్టమ్‌ను హ్యాక్ చేసి మూడు పాస్‌పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేశాడు. సెప్టెంబర్ 24న ప్రభుత్వ సెలవుదినం కారణంగా స్పెషల్ బ్రాంచ్ (2) కార్యాలయం మూసివేసిన సమయంలో జరిగినట్టుగా విచారణలో తేలింది.
పాస్‌పోర్టు దరఖాస్తు వెరిఫికేషన్ పూర్తిచేసిన పత్రాలలోని ముగ్గురు వ్యక్తుల వివరాలు కూడా అధికారులు సేకరిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు ముంబైలోని ఆంటోప్ హిల్, చెంబూర్, తిలక్ నగర్ నివాసితులుగా గుర్తించారు.
ఇక, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను వివరిస్తూ ఒక అధికారి ఇలా చెప్పారు.. పాస్‌పోర్ట్ కోరుకునే వ్యక్తి పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటారు. ఆ తర్వాత చిరునామా, ఇతర వివరాలను స్థానిక పోలీసులు ధృవీకరించాల్సి ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ (PVR) ముంబైకి సంబంధించిన స్పెషల్ బ్రాంచ్(2) కి సమర్పించబడుతుంది. అక్కడ ధృవీకరణను ఆమోదించే ముందు దరఖాస్తును సమీక్షిస్తారు.
రిమార్క్‌లతో కూడిన ధృవీకరణ పత్రాలు ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి (RPO) ఫార్వార్డ్ చేయబడతాయి. అటువంటి దరఖాస్తుదారులకు పాస్‌పోర్ట్ కేటాయింపు లేదా తిరస్కరణపై ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ వెరిఫికేషన్ సిస్టమ్‌ను అందించింది. పాస్‌పోర్ట్ శాఖలో పోస్ట్ చేయబడిన అధికారులందరికీ ప్రత్యేక లాగిన్ ఐడీలను అందించింది.