రేపిస్టుల విడుదలను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో పిటిషన్.. 13న సుప్రీంకోర్టులో విచారణ

By Mahesh KFirst Published Dec 10, 2022, 2:07 PM IST
Highlights

బిల్కిస్ బానో కేసులో దోషులను సత్ప్రవర్తన పేరిట గుజరాత్ ప్రభుత్వం ఆగస్టు 15న విడుదల చేయడం కలకలం రేపింది. వారి విడుదలను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు వేశారు.
 

న్యూఢిల్లీ: బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు 13వ తేదీన విచారించనుంది. జస్టిస్ అజయ్ రస్తోగీ సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం వాదనలు విననుంది. బిల్కిస్ బానోపై గ్యాంగ్ రేప్‌నకు సంబంధించిన 2002 నాటి కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ఆగస్టు 15న విడుదల చేసింది. సత్ప్రవర్తన కింద వీరిని జైలు నుంచి విడుదల చేసింది.

11 మంది దోషుల విడుదలను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. 2002 గుజరాత్ అల్లర్లు దేశాన్ని వణికించింది. ముఖ్యంగా అక్కడి ముస్లింలకు పీడ కలగా ఇప్పటికీ వెంటాడుతున్నది. దాడులు, హత్యలు, అత్యాచారాలు ఎన్నో జరిగాయి. 2002 డిసెంబర్ 13న బిల్కిస్ బానోపైనా దాడి జరిగింది. 

బిల్కిస్ బానో అప్పుడు 21 ఏళ్ల వివాహిత, గర్భిణి, ఆ ఐదు నెలల గర్భిణిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆమె మూడేళ్ల చిన్నారి సహా ఏడుగురు కుటుంబ సభ్యులను దారుణంగా చంపేశారు.

ఈ కేసులో దోషులుగా తేలి గుజరాత్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీన విడుదల చేసింది. సత్ప్రవర్తన పేరిట ఆగస్టు 15న వారిని విడుదల చేయడం కలకలం రేపింది.

Also Read: ‘ఆమె గర్భంతో ఉన్నా కూడా అత్యాచారం చేశారు’-బిల్కిస్ బానో ఘటనను తల్చుకుంటూ ఉద్వేగానికి లోనైన ఒవైసీ

ఈ పిటిషన్ ఫైల్ చేస్తున్న సందర్భంలో బిల్కిస్ బానో ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. మరోసారి న్యాయం కోసం నిలబడి, కోర్టు గడప తొక్కడం తనకు అంత సులువుగా ఏమీ అనిపించడం లేదని పేర్కొన్నారు. తన జీవితాన్ని, తన కుటుంబాన్ని నాశనం చేసిన వారిని విడుదల చేయడం చూసి నిశ్చేష్టురాలిని అయిపోయానని వివరించారు. నా పిల్లల, నా బిడ్డల ప్రాణాలను గురించి ఆలోచిస్తూ నిస్తేజంగా నిలిచిపోయాను అని తెలిపారు. అన్నింటికి మించి ఆశ ఆవిరి అయిపోవడాన్ని తనను బాధించింది వివరించారు.

కానీ, తన గొంతును ఇతర గళాలు భర్తీ చేశాయని వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తనకు సంఘీభావంగా వినిపిస్తున్న గొంతుకలు తనలో మళ్లీ న్యాయంపై ఆశను రేపాయని తెలిపారు. 

click me!