యూట్యూబ్‌లో ఆ వీడియోలు చూడటం వల్లే ఎగ్జామ్ ఫెయిలయ్యా.. పరిహారం కోసం కోర్టుకు వెళ్తే.. దిమ్మతిరిగే షాక్ ..

By Rajesh KarampooriFirst Published Dec 10, 2022, 1:28 PM IST
Highlights

 యూట్యూబ్‌లో అశ్లీల ప్రకటనలు చూడటం వల్లే తాను పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని. ఇందుకు కారణమైన యూట్యూబ్‌ నుంచి పరిహారం ఇప్పించాలని కోరుతు ఓ యువకుడు సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. కానీ ఆ యువకుడికి సుప్రీంకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కోర్టు విలువైన సమయం వృథా అవుతోందని ఆగ్రహించిన సదరు యువకుడికి .. రూ.లక్ష జరిమానా విధించింది.  

యూట్యూబ్‌పై నష్టపరిహారం దావా వేసిన ఓ యువకుడికి సుప్రీంకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇలాంటి పిటిషన్లతో కోర్టు విలువైన సమయం వృథా అవుతోందని ఆగ్రహించిన సుప్రీం కోర్టు సదరు యువకుడికి .. రూ.లక్ష జరిమానా విధించింది. తాను అంత భారీ మొత్తాన్ని కట్టలేననీ లబోదిబోమనడంతో..కోర్టు రూ.లక్ష జరిమానాని రూ.25వేలకు తగ్గించింది. చేసేది ఏమి లేక నోరు మూసుకుని జరిమానా కడతానని చెప్పాల్సి వచ్చింది.

ఇంతకీ ఏం జరిగింది.. 

యూట్యూబ్‌లో అశ్లీల ప్రకటనలు ప్రసారమవుతున్నాయనీ, వాటి తన దృష్టిని మరల్చిందని, దీంతో ఎంపీ పోలీస్ పరీక్షలో తాను ఫెయిల్ అయ్యానని, దీనికి కారణం గూగుల్ ఇండియా నుంచి తనకు రూ.75 లక్షలు పరిహారం ఇప్పించాలంటూ మధ్యప్రదేశ్ కు చెందిన కిషోర్ చౌదరి అనే యువకుడు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. అంతేకాదు ఇటువంటి కంటెంట్ ఉన్న యూట్యూబ్ కు నోటీసులు ఇవ్వాలని ఇటువంటి కంటెంట్ న నిషేధించాలని కోరాడు.

ఈ పిటిషన్ విచారణ సమయంలో జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంటర్నెట్ ప్రకటనలు చూసి పోటీ పరీక్షల్లో ఫెయిల్ కావడమేంటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అసలూ యూట్యూబ్ లో ప్రసారమయ్యే ఆ ప్రకటనలను ఎవరు చూడమన్నారు? అని ప్రశ్నించింది. మీకు ప్రకటన నచ్చకపోతే, దానిని పట్టించుకోవద్దని, చూడవద్దని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇలాంటి పిటిషన్ వల్ల కోర్టు సమయాన్ని వృధా అవుతోందనీ, పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధించింది. తద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని సుప్రీంకోర్టు పిటిషనర్‌కు తెలిపింది. దీంతో పిటిషనర్ కు దిమ్మతిరిగింది. తాను నిరుద్యోగిని.. అంత మొత్తాన్ని చెల్లించలేననీ కోర్టును వేడుకున్నాడు. మీరు పబ్లిసిటీ కోసమే ఇలా చేశారనీ, మిమ్మల్ని క్షమించరాని నేరమని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం కోర్టు పిటిషనర్‌కు పరిహారం మొత్తాన్ని రూ. లక్ష రూపాయాల నుంచి రూ. 25,000 తగ్గించింది. ఆ మొత్తాన్ని కోర్టు ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.  

click me!