అల్లోపతి డాక్టర్లపై ఆరోపణలు ఎందుకు?.. దానికి గ్యారంటీ ఇస్తాడా?: బాబా రాందేవ్‌పై సుప్రీం కోర్టు ఫైర్

By Mahesh KFirst Published Aug 23, 2022, 3:02 PM IST
Highlights

యోగా గురువు బాబా రాందేవ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లోపతి డాక్టర్లపై ఎందుకు నోరుపారేసుకుంటున్నారని మండిపడింది. ఆయన అనుసరిస్తున్న విధానంతో సర్వ ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చని చెప్పడానికి గ్యారంటీ ఏమిటని ప్రశ్నించింది.

న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రాందేవ్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అల్లోపతి వంటి ఆధునిక వైద్య వ్యవస్థ పై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని మందలించింది. ఆయుర్వేదాన్ని మరింత పాపులర్ చేయడానికి ఆయన ప్రచారం చేయడంలో తప్పు లేదని, కానీ, ఇతర వ్యవస్థలను ఆయన విమర్శించడం సరికాదని సీజేఐ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం మండిపడింది.

‘ఆల్లోపతి వైద్యులపై బాబా రాందేవ్ ఎందుకు నిందలు మోపుతున్నారు? ఆయన యోగాను పాపులర్ చేశాడు. మంచిది. కానీ, ఇతర వ్యవస్థను విమర్శించడం ఎందుకు? ఇతర వ్యవస్థను విమర్శించరాదు. ఆయన ఫాలో అవుతున్న పద్ధతే ప్రతి అనారోగ్య సమస్యకు విరుగుడుగా పని చేస్తుందని చెప్పడానికి గ్యారంటీ ఏమిటీ?’ అని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ సీజేఐ ఎన్వీ రమణ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. యోగా గురువు రాందేవ్ బాబా.. అల్లోపతిక్ మెడిసిన్స్, తమ వైద్యులు, కరోనా టీకా పంపిణీ పై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని ఐఎంఏ తమ పిటిషన్‌లో ఆరోపించింది.

ఐఎంఏ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గతేడాది కరోనావైరస్ సెకండ్ వేవ్ విలయం తాండవం చేస్తున్న సమయంలో రాందేవ్ బాబా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అల్లోపతిక్ మెడిసిన్స్ వల్లే లక్షలాది మంది ప్రజలు మరణిస్తున్నారని రాందేవ్ బాబా ఆరోపణలు చేశారు. కరోనా టీకా డబుల్ డోసులు తీసుకున్న  వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఐఏఎం రాందేవ్ బాబా పై మండిపడింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెంటనే బాబా రాందేవ్ పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆయన అజ్ఞానంతో వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది.

కరోనా సమయంలో ప్రాణాలు ఫణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యులను విమర్శించడం దారుణం అని ఐఎంఏ ఆవేదన వ్యక్తం చేసింది.

click me!