కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం రూల్స్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

By telugu teamFirst Published Sep 3, 2021, 1:46 PM IST
Highlights

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం అందించడానికి రూపొందించాల్సిన నిబంధనలపై కేంద్రం జాప్యం వహించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రూల్స్ రూపొందిండచానికి ఇంకెంతకాలం పడుతుందని నిలదీసింది. ఇంతలోపు థర్డ్ వేవ్ కూడా వచ్చిపోయేలా ఉన్నదని మొట్టికాయలు వేసింది. కరోనా మహమ్మారిని విపత్తు చట్టం కింద గుర్తించినందున మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాల్సిందేనని ఇది వరకే సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: కోరనా మహమ్మారిని విపత్తుగా ప్రభుత్వం ప్రకటించింది. డిజాస్టర్ యాక్ట్ ప్రకారం బాధితులకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంటుంది. దీనినే లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారాన్నిఇవ్వాలని పిటిషన్లు డిమాండ్ చేశాయి. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్నది. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, ఎంతమొత్తంలో ఇవ్వాలన్నది ప్రభుత్వమే తేల్చుకోవాలని తెలిపింది. అలాగే, కరోనా మృతుల డెత్ సర్టిఫికేట్‌లో ప్రత్యేకంగా కారణాన్ని పొందుపరచడం లేదని, దానివల్ల పరిహారానికి దరఖాస్తు చేసుకోవడం ఇబ్బంది అవుతుందని పిటిషనర్లు కోర్టులో లేవనెత్తారు. ఈ సమస్యనూ వెంటనే పరిష్కరించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ పిటిషన్లను విచారిస్తూ సుప్రీంకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడింది. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం అందించడానికి రూపొందించాల్సిన నిబంధనలు ఇంకా పూర్తికాకపోవడాన్ని తప్పుపట్టింది. ఇంకెన్నాళ్లు పడుతుందని నిలదీసింది. కేంద్ర ప్రభుత్వం ఈ పరిహారం అందించడానికి రూల్స్ రూపొందించేనాటికి థర్డ్ వేవ్ కూడా వచ్చి పోపయేలా ఉన్నదని మొట్టికాయలు వేసింది. మరణ ధ్రువీకరణ పత్రం, పరిహారం, ఇతర అంశాలపై ఆదేశాలు వెలువరించి చాన్నాళ్లు గడిచిందని గుర్తు చేసింది.

గతనెల 16న సుప్రీంకోర్టు ఈ పిటిషన్లు విచారిస్తూ ఎక్స్‌గ్రేషియా అందించడానికి నిబంధనలను నాలుగు వారాల్లో రూపొందించాలని కేంద్రాన్నిఆదేశించింది. డెత్ సర్టిఫికేట్‌పై తీసుకున్న గైడ్‌లైన్స్‌ను రెరండు వారాల్లో తెలియజేయాలని పేర్కొంది. డిజాస్టర్ యాక్ట్ 2005 కింద కరోనాను ప్రకటించినందున మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాల్సిందేనని జూన్ 30న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమ ఆదేశాలను పాటించడంలో కేంద్రం ఎందుకు విఫలమవుతున్నదని గత విచారణలో ప్రశ్నించింది. సెప్టెంబర్ 11లోగా కేంద్ర ప్రభుత్వం తమ ఆదేశాలపై అఫిడవిట్ ఫైల్ చేయాలని ఆదేశించింది.

click me!