Pegasus: పెగాసెస్ గూఢచర్యంపై దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు.. సుప్రీంకోర్టు నిర్ణయం

By telugu teamFirst Published Sep 23, 2021, 12:26 PM IST
Highlights

పెగాసెస్ గూఢచర్యం కేసుపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తునకు నిపుణుల కమిటీని వేయనున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే ఎన్‌వీ రమణ తెలిపారు. వచ్చే వారంలోగా నిపుణుల కమిటీ సభ్యులను ఖరారు చేస్తామని, సమగ్ర ఆదేశాలను వెలువరిస్తామని వివరించారు.
 

న్యూఢిల్లీ: దేశరాజకీయాలను కుదిపేసిన పెగాసెస్ గూఢచర్యం(Pegasus snooping) కేసులో సుప్రీంకోర్టు(Supreme court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తునకు నిపుణుల కమిటీ(Expert Panel) వేయనున్నట్టు తెలిపింది. దీనిపై సమగ్రమైన తీర్పు వచ్చే వారం వెలువరించనున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ(CJI NV Ramana) వెల్లడించారు. ఈ కమిటీ కోసం కొంత మందిని ఎంపిక చేయాలని తాము భావించామని, కానీ, వ్యక్తిగత కారణాలతో వారు అందులో ఉండటానికి నిరాకరించారని వివరించారు. అందువల్లే ఈ కమిటీ ఏర్పాటు ఆలస్యమైందని తెలిపారు. వచ్చే వారంలో నిపుణుల కమిటీపై సమగ్ర ఆదేశాలు వెలువరిస్తామని చెప్పారు.

సుప్రీంకోర్టులో ఓ కేసు విచారిస్తూ సీజేఐ ఎన్‌వీ రమణ ఈ విషయాన్ని వెల్లడించారు. సీనియర్ అడ్వకేట్ సీయూ సింగ్‌కు నిపుణుల కమిటీపై చెప్పారు. వచ్చే వారానికల్లా టెక్నికల్ ఎక్స్‌పర్ట్ టీమ్‌లో చేర్చబోయే సభ్యులను ఖరారు చేస్తామని తెలిపారు. వచ్చే వారం ఈ కమిటీని వెల్లడిస్తామని, కేసుకు సంబంధించి సమగ్ర ఆదేశాలను వెలువరిస్తామని చెప్పారు.

పెగాసెస్ గూఢచర్యంపై స్వతంత్ర్య సభ్యులతో కూడిన కమిటీతో దర్యాప్తు చేయడంపై తమకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టుకు తెలిపింది. పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ప్రముఖ జర్నలిస్టులు, రాజకీయ నేతల ఫోన్‌లపై నిఘా వేశారన్న ఫిర్యాదులను స్వతంత్ర సభ్యులతో దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నది.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే బయటికి వచ్చిన పెగాసెస్ గూఢచర్యం వ్యవహారం సంచలనాన్ని రేపింది. పార్లమెంటు సమావేశాలను కుదిపేసింది. విపక్షాలన్నీ పెగాసెస్‌పై చర్చ జరపాలని పట్టుబట్టాయి. 

ఇజ్రాయెల్ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఇద్దరు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర ప్రముఖ జర్నలిస్టుల స్మార్ట్‌ఫోన్‌లపై కేంద్ర ప్రభుత్వం నిఘా వేసిందని కథనాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పౌరుల వ్యక్తిగత గోప్యతను భంగం చేసిందని, అక్రమంగా వారి వ్యక్తిగత వ్యవహారాల్లోకి జొరబడిందని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. పెగాసెస్ నిఘా‌పై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశాయి. కానీ, ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. ఈ నిరసనలతోనే పార్లమెంటు సమావేశాల్లో గందరగోళం నెలకొంది.

click me!