
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో గోవుకు విశేష ప్రాధాన్యత పెరిగింది. పురాణాల్లో గోవుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. కానీ, దేశవ్యాప్తంగా ఈ విషయంపై ఇటీవలి కాలంలోనే ఎక్కువ ప్రచారం జరిగింది. ఈ తరుణంలోనే గోవధకు వ్యతిరేకంగా చట్టాలు కూడా వచ్చాయి. తాజాగా, గోవును ఏకంగా జాతీయ జంతువుగా ప్రకటించాలని ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టులో దాఖలైంది.
న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, అభయ్ ఎస్ ఒకాల ధర్మాసనం ముందుకు ఈ పిల్ వచ్చింది. ఈ పిటిషన్ వింటూనే ఇందులో ఏ ప్రాథమిక హక్కు భంగమైందని అడిగింది. అసలు ఇది కోర్టు చేసే పనేనా? అని ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు ఎందుకు ఫైల్ చేస్తారని పేర్కొంది. తద్వారా వాటి కాస్త్ ఎందుకు విధించేలా చేస్తారు అని అడిగింది. ఇందులో అసలు ఏ ప్రాథమిక హక్కు ఉల్లంఘన జరిగింది అని వివరించింది. మీరు కోర్టుకు వచ్చారని చట్టాన్ని గాల్లోకి విసిరేయమంటారా? అని బెంచ్ మండిపడింది.
ఈ పిటిషన్‌ను కౌన్సెల్ కోర్టులో సమర్పించారు. గో రక్షణ చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
ధర్మాసనం ఈ లాయర్‌కు వార్నింగ్ ఇచ్చింది.ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నందుకు ఫైన్ వేస్తానని పేర్కొంది. దీంతో ఆ లాయర్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. మ్యాటర్ డిస్మిస్ చేశారు.
గోవంశ్ సేవా సదన్ అనే ఎన్జీవో ఈ పిల్‌ను దాఖలు చేసింది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరుతూ పిటిషన్ వేసింది.