మహారాష్ట్ర: మరాఠాలకు రిజర్వేషన్లు.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం

By Siva KodatiFirst Published Mar 26, 2021, 6:32 PM IST
Highlights

మహారాష్ట్రలోని విద్యా, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న ఓ చట్టం రాజ్యాంగ బద్దతను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది

మహారాష్ట్రలోని విద్యా, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న ఓ చట్టం రాజ్యాంగ బద్దతను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేయాలంటూ 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలన్న అంశంపైనా సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత గుప్త, జస్టిస్ రవీంద్ర భట్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరుపుతోంది.

రిజర్వేషన్లకు పరిమితులు విధిస్తూ తొమ్మిది మంది సుప్రీం న్యాయమూర్తులు వెలువరించిన తీర్పును పునఃసమీక్షించే అంశంపై అన్ని రాష్ట్రాల నుంచి అభిప్రాయం తీసుకోవాలని బెంచ్ నిర్ణయించింది.

మార్చి 15న ఈ కేసులో వాదనలు ముగిశాయి. మహారాష్ట్రలో సమాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఎస్‌ఈబీసీ) చట్టం- 2018 కింద  విద్యా, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని బోంబే హైకోర్టు సమర్థించింది.

అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ల దాఖలయ్యాయి. మొత్తం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు 50 శాతానికి పరిమితం చేసినప్పటికీ.. ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని విస్తరించుకోవచ్చని 2019 జూన్ 27న బోంబే హైకోర్టు తీర్పు వెలువరించింది.

అయితే ఎస్ఈబీసీ చట్టం కింద విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమేనంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తెలియజేసింది. 

click me!