కొవిడ్ నుంచి రక్షించాలని పేషెంట్లను అగ్నికి ఆహుతిస్తామా?: సుప్రీంకోర్టు ఆగ్రహం

By telugu teamFirst Published Aug 27, 2021, 6:11 PM IST
Highlights

కరోనా మహమ్మారి నుంచి రక్షించాలనుకునే క్రమంలో వారిని మంటలకు బలివ్వలేం కదా అని సుప్రీంకోర్టు మండిపడింది. గుజరాత్ ప్రభుత్వం హాస్పిటల్ భవనాల అనుమతులకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది.

న్యూఢిల్లీ: గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కరోనా మహమ్మారి నుంచి రక్షించాలని వారిని అగ్నికి ఆహుతిస్తామా? అంటూ మండిపడింది. హాస్పిటల్ బిల్డింగ్ సేఫ్టీ రూల్స్‌ను సడలిస్తూ గుజరాత్ ప్రభుత్వం జులై 8న జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించింది. బిల్డింగ్ యూజ్ పర్మిషన్ లేని భవనాలను హాస్పిటళ్లకు వినియోగించుకున్నా వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని గుజరాత్ ఆదేశాలు జారీ చేసింది.

హాస్పిటళ్లలో అగ్నిప్రమాదాలకు సంబంధించిన అంశాలను విచారిస్తున్న సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహించింది. ‘గుజరాత్ ప్రభుత్వ నోటిఫికేషన్లు ప్రజా ప్రయోజనాలకు, సేఫ్టీకి విరుద్ధంగా ఉన్నాయి. మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలనే లక్ష్యంతో వారిని మంటలకు బలిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు తెలిపింది. ‘కావాల్సిన అనుమతులు, సేఫ్టీ నిబంధనలు లేకుండానే 30 ఏళ్ల నుంచి నడుస్తున్న హాస్పిటళ్లు ఉన్నాయి. మనం తరుచూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న డెవలపర్లనే మళ్లీ మళ్లీ ఉపేక్షిస్తున్నాం. అందుకే ఈ సమస్య కొనసాగుతూనే ఉన్నది’ అంటూ పేర్కొంది.

గుజరాత్ ప్రభుత్వ న్యాయవాదిని పేర్కొంటూ జస్టిస్ ఎంఆర్ షా ఈ విధంగా అన్నారు.‘ఐసీయూ కండీషన్లు ఎలా ఉన్నాయో చూశారా? చిన్న చిన్న గదుల్లో ఏడెనిమిది బెడ్లు ఉంటాయి. ఐసీయూ బెడ్లపై మేం ఆదేశాలు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆపత్కాలంలో ఉన్నాం. కానీ, మీరు ఐసీఎంఆర్ నిబంధనలు ఒక సారి చూస్తే 80శాతం ఐసీయూలు మూసేయాల్సి ఉంటుంది’ అంటూ హాస్పిటళ్ల దీనావస్థను వెల్లడించారు.

అలాంటి అక్రమ బిల్డింగ్‌లను ప్రభుత్వం అనుమతించవద్దని న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. ‘ప్రభుత్వం ఇలాంటి అక్రమ బిల్డింగ్‌లను అనుమతిస్తే రక్షణ లేకుండాపోతుంది. ఐదారు ఫ్లోర్‌లుండే బిల్డింగ్‌లు హాస్పిటళ్లకు వినియోగించడం కష్టమవుతుంది. కొన్నిసార్లు వాటికి లిఫ్ట్‌లు ఉండకపోవచ్చు. ఎగ్జిట్ ద్వారాలు సరైన రీతిలో లేకపోవచ్చు. నిబంధనలు ఇలాగే సరళతరం చేస్తూ వెళ్తే పేషెంట్ల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినట్టే’ అని అన్నారు.

click me!