
గువహతి: కరోనా వైరస్ సెకండ్ వేవ్ ముప్పు ఇంకా ముగియలేదని, పండుగ సీజన్‌లో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం ఇటీవలే ప్రజలకు సూచించింది. కాగా, అసోం మంత్రి చంద్ర మోహన్ పటోవరి లెక్క ప్రకారం కరోనా వైరస్ ఎవరెవరికి సోకాలో ముందుగానే నిర్ణయించబడి ఉన్నదని తెలిపారు. అంతేకాదు, ఆ వైరస్ దేవుడి కంప్యూటర్‌లో సృష్టించబడిందని అన్నారు. రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు తగ్గిపోకముందే ఆయన చేసిన వ్యాఖ్యలపై అన్నిసెక్షన్‌ల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి.
‘కరోనా వైరస్‌ను మనిషి తయారుచేయలేదు. దేవుడి కంప్యూటర్ ఈ మహమ్మారిని సృష్టించింది. ఈ వైరస్ భూమిపై ఎవరికి సోకాలో ప్రకృతే నిర్ణయిస్తుంది. ఎవరిని భూమిపై నుంచి తీసుకెళ్లాలో కూడా ప్రకృతి డిసైడ్ చేసేస్తుంది. రెండు శాతం మరణాల రేటుతో కంప్యూటర్ ఈ వైరస్‌ను భూమి మీదకు పంపింది’ అని పేర్కొన్నారు.
కరోనా కారణంగా విధవలుగా మారిన వారికి అసోం ప్రభుత్వం రిలీఫ్ అందిస్తున్నది. కామరూప్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రమోహన్ పోటవరి లబ్దిదారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. కరోనా మహమ్మారి ఒకవైపు ప్రాణాలు తీసేస్తుంటే మరొకవైపు కొందరు ఎలాంటి మాస్కులు ధరించకున్నా జీవించేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన గువహతి ఫుట్‌పాత్‌పై మాస్క్ ధరించకుండా ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకుండా తిరుగుతున్న ఓ మహిళను ప్రస్తావించారు. ఆమెకు వైరస్ సోకలేదన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కోటానుకోట్ల రూపాయలు పరిశోధనలకు కేటాయిస్తున్నదని అసోం మంత్రి అన్నారు. కానీ, కరోనా లాంటి అతి సూక్ష్మమైన ఒక వైరస్‌కు విరుగుడు కనిపెట్టలేకపోయిందని తెలిపారు. కరోనాకు మందు కనిపెట్టడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని విమర్శించారు. అసోంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర మంత్రి వ్యాఖ్యలపై అన్నివర్గాల నుంచి విమర్శలు వచ్చాయి.