Delhi Pollution: మీకు 24 గంటల సమయం ఇస్తున్నాం: ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

By telugu teamFirst Published Dec 2, 2021, 12:48 PM IST
Highlights

ఢిల్లీ కాలుష్యం పెరిగిపోతున్నదని, దాని కట్టడికి చర్యలు తీసుకోవాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. ప్రభుత్వాలు ఎన్ని అఫిడవిట్లు సమర్పిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం మార్పులు కనపడటం లేదని, అసలు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారనీ తాము భావించడం లేదని కోర్టు సీరియస్ అయింది. పారిశ్రామిక, వాహనాల ఉద్గారాల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఢిల్లీ ప్రభుత్వానికి తాము 24 గంటల సమయం ఇస్తున్నామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వాలు అనేక వివరాలు సమర్పిస్తున్న ఢిల్లీలో మాత్రం కాలుష్యం పెరుగుతూనే ఉన్నదని పేర్కొంది.
 

న్యూఢిల్లీ: దేశరాజధానిలో వాయు కాలుష్యం(Air Pollution)పై Supreme Court విచారిస్తున్నది. తాజాగా, వరుసగా నాలుగో వారమూ కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వ(Delhi Govt) వాదనలు విన్నది. అన్ని వాదనలు, టాస్క్ ఫోర్స్‌లు, చర్యలు చెబుతున్నారు గానీ, క్షేత్రస్థాయిలో కాలుష్యం మాత్రం తగ్గడం లేదని సుప్రీంకోర్టు మండిపడింది. అంతేకాదు, వాస్తవంగా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే తాము భావిస్తున్నామని, ఎందుకంటే కాలుష్యం రోజు రోజూ పెరుగుతూనే ఉన్నదని పేర్కొంది. కేవలం సమయాన్ని వృథా చేస్తున్నట్టే అర్థమవుతున్నదని వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, పారిశ్రామిక, వాహనాల ఉద్గారాల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్(Warning) ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇస్తున్నట్టు హెచ్చరించింది.

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద స్థాయి దాటి పోవడంతో సుప్రీంకోర్టు ఇటీవలే కొన్ని సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సూచనల మేరకే ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలను మూసేసింది. 15 రోజులు పాఠశాలలను మూసేసి మళ్లీ గత నెల 29వ తేదీని రీఓపెన్ చేసింది. దీనిపైనా సీజేఐ ఎన్‌వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం స్పందించింది. ప్రజల ఆరోగ్యం కోసం వర్క్ ఫ్రమ్ హోం చేయిస్తామని, స్కూల్స్ మూసేస్తామని మీరు చెప్పారని, కానీ, క్షేత్రస్థాయిలో అది కనిపించడం లేదని ప్రశ్నించింది. మూడేళ్లు, నాలుగేళ్ల పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారని, కాగా, వయోజనులు వర్క్ ఫ్రమ్ హోం ఆధారంగా పని చేసుకుంటున్నారని నిలదీసింది.

Also Read: కలుషిత రాజధానితో ప్రపంచానికి ఏం సంకేతాలు పంపుతున్నాం.. సుప్రీంకోర్టు

ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పాఠశాలలపై విస్తృత చర్చ జరుగుతున్నదని అన్నారు. పిల్లలు విద్యార్జన నష్టపోతారని, ఇంకెన్నో పరిణామాలు ఎదురవుతాయనే చర్చ ఉన్నదని వివరించారు. అందుకే తాము పాఠశాలలను మళ్లీ తెరిచామని తెలిపారు. అయితే, అందుకు ఆన్‌లైన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంచామని వివరించారు. ‘మీరేమో రెండ అవకాశాలను వారికి ఇచ్చామని చెబుతున్నారు. ప్రత్యక్షంగా పాఠశాలలకు వెళ్లడం లేదా ఆన్‌లైన్‌లో క్లాసులు వినడం వారి స్వేచ్ఛకు వదిలిపెట్టామని అంటున్నారు. కానీ, అలా అవకాశం ఇచ్చినప్పుడు ఇంటి పట్టునే ఉండాలని ఎవరు కోరుకుంటారు? మాకు కూడా పిల్లలున్నారు. మనవల్లు ఉన్నారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు మన అందరికీ తెలిసినవే కదా. మీరు చర్యలు తీసుకోకుంటే రేపు మేము స్ట్రిక్ట్  యాక్షన్ తీసుకుంటాం. మేం మీకు 24 గంటల సమయం ఇస్తున్నాం’ అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్‌వీ రమణ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేస్తూ 17ఏళ్ల ఢిల్లీ స్టూడెంట్ ఆదిత్య దూబే పిటిషన్ వేశారు. దీన్ని సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారిస్తున్నది. గత నెల 13న ఈ పిటిషన్‌పై విచారిస్తూ కాలుష్య నియంత్రణకు సోమవారం కల్లా Emergency Planతో రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీజేఐ ఎన్వీ రమణ ఆదేశించారు. ‘ఢిల్లీలో వాయు కాలుష్యం ఎంత తీవ్రతగా ఉన్నదో అర్థమవుతున్నదా?.. ఇంటిలోనూ మాస్కులు ధరిస్తున్నాం’ అని అన్నారు. ఢిల్లీలో రెండు రోజులు లాక్‌డౌన్ విధించే ఆలోచననూ చేయాలని సూచనలు చేశారు. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

click me!