బెంగాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ అధినేత్రి, రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తన స్వరాన్ని మరింతగా పెంచారు. ఈ క్రమంలోనే యూపీఏది ముగిసిన చరిత్ర అంటూ ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలకు తాజాగా కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది.
తృణముల్ కాంగ్రెస్ పార్టీ దేశంలోని పలు ప్రాంతాల్లో మరింతగా విస్తరించే చర్యలను వేగవంతం చేయడంతో పాటు దేశంలోని ప్రతిపక్షంలో ప్రధాన పార్టీగా బలపడాలనే విధంగా ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలి బెంగాల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత.. తన దూకుడును పెంచింది. దీనికి అనుగుణంగానే తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీతో పాటు ఇతర పార్టీలపై ఘాటైన వ్యాఖ్యలు, విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఫాసిస్ట్ Bjp ప్రభుత్వాన్ని గద్దెదించడానికి దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్ని కలిసి రావాలని కోరారు. అలాగే, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపీఏ)ది ముగిసిన చరిత్రగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మమతా బెనర్జీ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ మమతకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్రతిపక్ష ఐక్యతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
undefined
ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అనంతరం మమతా బెనర్జీ.. "యూపీఏ లేదు.. అది ముగిసిన గత చరిత్ర" అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ స్పందిస్తూ.. "యూపీఏ. కాంగ్రెస్ లేకుంటే యూపీఏ ఆత్మ లేని శరీరం అవుతుంది. ప్రతిపక్ష ఐక్యతను ప్రదర్శించాల్సిన సమయం ఇది" అంటూ ట్వీట్ చేశారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సైతం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. భారత రాజకీయాల వాస్తవికతను గుర్తించాలని పేర్కొన్నారు. భారత రాజకీయాల వాస్తవికత అందరికీ తెలుసు. కాంగ్రెస్ లేకుండా ఎవరైనా బీజేపీని ఓడించగలరని అనుకోవడం కేవలం కల మాత్రమే అని వేణుగోపాల్ చెప్పారు.
అలాగే, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సైతం మమతా వ్యాఖ్యలపై స్పందించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ఇరకాటంలో పడేసేందుకే మమతా బెనర్జీ కొత్త అంశాలను తెరమీదకు తీసుకువస్తున్నారనీ, కొత్త కుట్రకు ప్రణాళికలు వేశారని పేర్కొన్నారు. మమతా చేస్తున్న ఈ చర్యల కారణంగా బీజేపీకి లాభిస్తుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ పరిస్థితి దిగజారుతుండటంతో.. తమను నిలబెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. ఇలాంటి సమయంలో మమతా బెనర్జీ కొత్త కుట్రకు పాల్పడుతూ.. బీజేపీ ఆక్సిజన్ సరఫరా దారులా మారిందని అన్నారు. "యూపీఏ గురించి మమతా బెనర్జీకి తెలియదా? ఆమెకు పిచ్చిమొదలైందని తాను అనుకుంటున్నానని" అధీర్ రంజన్ చౌదరి అన్నారు. అలాగే, ప్రతిపక్షాలు విడిపోకూడదనీ, తమలో తాము పోరాడవద్దనీ, అందరం కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం సాగించాలని కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే నొక్కి చెప్పారు.