పతంజలి ప్రకటనల కేసు.. విచారణకు రావాలని రాందేవ్, బాలకృష్ణలకు సుప్రీంకోర్టు ఆదేశం

By Sairam Indur  |  First Published Mar 19, 2024, 1:50 PM IST

తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో సుప్రీంకోర్టు ప్రముఖ యోగా గురురు రామ్ దేవ్ బాబా, పంతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ పై మండిపడింది. తమ ఎదుట ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశించింది.


ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో తదుపరి విచారణకు తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని వారికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ నోటీసుకు ఆ సంస్థ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.

కోర్టుకు ఇచ్చిన హామీని ప్రాథమికంగా ఉల్లంఘించినందుకు తమపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు చేపట్టకూడదో తెలియజేయాలని గతంలో కోర్టు జారీ చేసిన నోటీసులకు సమాధానాలు దాఖలు చేయడంలో కంపెనీ, బాలకృష్ణ విఫలమయ్యారని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Latest Videos

రాందేవ్ బాబాపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు చేపట్టకూడదో చెప్పాలని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. వ్యాక్సినేషన్ డ్రైవ్, ఆధునిక మందులపై రాందేవ్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

వ్యాధులను నయం చేస్తాయని చెప్పుకునే మూలికా ఉత్పత్తుల ప్రకటనలు చేసినందుకు ఫిబ్రవరిలో కోర్టు తీవ్రంగా మందలించింది. పతంజలి ఆయుర్వేద, మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ తమ ఉత్పత్తుల ప్రకటనలు, వాటి ఔషధ సామర్థ్యంపై కోర్టులో ఇచ్చిన హామీని ప్రాథమికంగా ఉల్లంఘించినందుకు వారిపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదని కోర్టు ప్రశ్నించింది.

ఎలాంటి వైద్య విధానాలకు వ్యతిరేకంగా మీడియా ప్రకటనలు చేయవద్దని కోర్టు కంపెనీని, దాని అధికారులను ఆదేశించింది. పతంజలి ఆయుర్వేద ఔషధాలు అనేక వ్యాధులను నయం చేస్తాయని ప్రకటనల్లో తప్పుడు వాదనలు, తప్పుడు ప్రచారం చేసినందుకు ఏం చర్యలు తీసుకున్నారని కేంద్రంపై కోర్టు ప్రశ్నించింది.
 

click me!