ఉద్యోగ అర్హతపై తప్పుడు సమాచారం ఇచ్చిన వారిని సర్వీసు నుంచి తొలగించవచ్చు.. సుప్రీం కోర్టు

By Sumanth KanukulaFirst Published Sep 27, 2022, 9:42 AM IST
Highlights

ఉద్యోగ అర్హతకు సంబంధించి ఫిట్‌నెస్ లేదా యోగ్యతపై తప్పుడు సమాచారం ఇచ్చిన, వాస్తవాలను  దాచిపెట్టిన ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. 

ఉద్యోగ అర్హతకు సంబంధించి ఫిట్‌నెస్ లేదా యోగ్యతపై తప్పుడు సమాచారం ఇచ్చిన, వాస్తవాలను  దాచిపెట్టిన ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. వాస్తవ సమాచారాన్ని దాచిపెట్టడం, తప్పుడు సమాచారం ఇవ్వడం ఉద్యోగి ప్రవర్తన తీరును సూచిస్తుందని పేర్కొంది. ముఖ్యంగా పోలీసు బలగాలలో రిక్రూట్‌మెంట్ విషయంలో పరిగణనలోకి తీసుకోవలసిన విస్తృత న్యాయ సూత్రాలను సుప్రీం కోర్టు నిర్దేశించింది. ప్రజల విశ్వాసాన్ని ప్రేరేపించే వారి సామర్థ్యం సమాజ భద్రతకు రక్షకమని పేర్కొంది. ముగిసిన క్రిమినల్ కేసు గురించి ఉద్యోగి నిజాయితీగా, సరిగ్గా డిక్లరేషన్ చేసిన సందర్భంలో కూడా..  యజమాన్యానికి పూర్వాపరాలను పరిశీలించే హక్కు ఉందని తెలిపింది. అభ్యర్థిని నియమించమని యజమాన్యాన్ని బలవంతం చేయలేమని సుప్రీం కోర్టు పేర్కొంది.

తమపై ఉన్న కేసుల వివరాలను దాచిపెట్టిన ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది దాఖలు చేసిన పిటిషన్‌లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జెబీ పార్టీవాలాలతో కూడి ధన్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసం కీలక వ్యాఖ్యలు చేసింది. వెరిఫికేషన్ ఫారమ్‌లో ఒక ఉద్యోగి ప్రాసిక్యూషన్/కన్విక్షన్ మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని అందించాలని కోరడం వెనకాల ఉద్దేశ్యం.. ఉద్యోగం,సేవలో కొనసాగడం కోసం అతని పాత్ర, సోషల్ బ్యాక్‌గ్రౌండ్‌ను అంచనా వేయడం అని పేర్కొంది.


‘‘ఉద్యోగి అతని ఫిట్‌నెస్ లేదా పదవికి అర్హతను ప్రభావితం చేసే విషయాలలో సమాచారాన్ని దాచిపెట్టినట్టుగా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే.. వారు సర్వీస్ నుండి తొలగించబడతారు’’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రొబేషన్ కాలంలో కూడా విచారణ లేకుండానే ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించేందుకు ఇవే మార్గదర్శకాలు వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో సమాచారాన్ని దాచిపెట్టి, ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన ప్రశ్నలకు తప్పుగా సమాధానమిచ్చిన ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది రెండు వేర్వేరు అప్పీళ్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

click me!