తబ్లీఘీ జమాత్ కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దేశానికే చెడ్డ పేరు వస్తుందని హెచ్చరిక

By telugu teamFirst Published Sep 2, 2021, 3:00 PM IST
Highlights

తబ్లిఘీ జమాత్‌పై కొన్ని మీడియా సంస్థలు అసభ్యకర భాషలతో రిపోర్ట్ చేశాయని, తప్పుడు వార్తలూ ప్రచురించాయని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను సీజేఐ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం విచారించింది. తబ్లిఘీ జమాత్‌ ఘటనపై తప్పుడు వార్తలు ప్రచురించడంపై మండిపడింది. ఇప్పటికీ వెబ్ పోర్టల్స్, యూట్యూబ్‌లో విరివిగా తప్పుడు వార్తలు ప్రచారమవుతున్నాయని, వీటిని నియంత్రించడానికి కేంద్రం ఆలోచిస్తున్నదా? అని ప్రశ్నించింది. మతపరమైన అంశాలతో తప్పుడు వార్తలు ప్రచారమైతే దేశానికే చెడ్డపేరు వస్తుందని హెచ్చరించింది.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ తొలి వేవ్‌లో చర్చనీయాంశమైన తబ్లిఘీ జమాత్‌ను సుప్రీంకోర్టు తాజాగా ప్రస్తావించింది. కొన్ని మీడియా సంస్థలు తబ్లిఘీ జమాత్ సమావేశంపై ఫేక్ న్యూస్ ప్రచారం చేశాయని మండిపడింది. ఇది ఇలాగే సాగితే దేశానికే చెడ్డపేరు వస్తుందని తెలిపారు. ఇదంతా ఎందుకు జరుగుతున్నదో అర్థం కావడం లేదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రతిదానికి మతపరమైన కోణం తీస్తున్నారని ఆవేదన చెందారు. మతపరమైన అంశాలతో తప్పుడు వార్తలు ప్రచారమైతే దేశానికే చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. వెబ్ న్యూస్ పోర్టల్స్ నియంత్రణకు మెకానిజమే లేదని పేర్కొన్నారు. ఇప్పుడు యూట్యూబ్ చానెల్ ఎవరైనా స్టార్ట్ చేయవచ్చునని, అందులో ఫేక్ న్యూస్ విరివిగా ప్రచారం చేయవచ్చునని తెలిపారు. వీటిని ఆపడానికి వ్యవస్థే లేదని పేర్కొన్నారు. తబ్లిఘీ జామాత్‌పై కొన్ని మీడియా సంస్థలు అభ్యంతరకర భాష వాడుతూ తప్పుడు రిపోర్ట్‌లు ప్రచురించాయని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తున్నది.

ఈ సందర్భంగా వెబ్ పోర్టల్స్, యూట్యూబ్ చానెల్స్‌లలో తప్పుడు వార్తల ప్రచారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘మీరొకవేళ యూట్యూబ్ ఓపెన్ చేస్తే.. కుప్పలు తెప్పలుగా తప్పుడు వార్తలను చూడవచ్చు. ఎవరైనా యూట్యూబ్ చానెల్ ప్రారంభించి ఫేక్ న్యూస్, వదంతలు ప్రచారం చేసే అవకాశముంది’ అని ఆయన పర్కొంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగవ్యవస్థలు, న్యాయమూర్తులపైనా ఇష్టారీతిన రాతలు రాసే అవకాశం వారికున్నదని, వారు కేవలం పవర్‌ఫుల్ మనుషుల మాటలే వింటుంటారని చెప్పారు. వీటిని
నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ప్రయత్నించిందా? అని ప్రశ్నించారు. 

ఇలాంటి సమస్యలకు పరిష్కారంగానే కేంద్ర ప్రభుత్వం న్యూ ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ రూల్స్‌ను తెచ్చిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా అన్నారు. అయితే, వీటిని సవాలు చేస్తూ హైకోర్టులలో పిటిషన్లు దాఖలయ్యాయని పేర్కొన్నారు. వీటన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ వేసిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పిటిషన్ విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆరువారాల తర్వాత విచారించనున్నట్టు తెలిపింది.

click me!