వేర్పాటువాద నేత సయ్యద్ అలీ గిలానీ మరణం సాకుగా భారత్‌పై పాకిస్తాన్ బురదజల్లే యత్నం

By telugu teamFirst Published Sep 2, 2021, 1:54 PM IST
Highlights

వేర్పాటువాద నేత, హురియత్ లీడర్ సయ్యద్ అలీ గిలానీ మరణాన్ని సాకుగా చూపి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై బుదరజల్లే పనిచేశారు. కశ్మీరీల స్వయం నిర్ణాయధికారం సహా వారి హక్కుల కోసం పోరాడిన సయ్యద్ అలీ గిలానీని భారత ప్రభుత్వం వేధించిందని ట్వీట్ చేశారు. గిలానీ మరణానికి సంతాపం ప్రకటిస్తూ పాకిస్తాన్ జాతీయ జెండాను సగం మేరకు అవనతం చేయనున్నట్టు తెలిపారు. అమాయకపు కశ్మీరీలను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్, దాని ముసుగుదారులందరూ చరిత్రలో కలిసిపోతారని కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వీ గట్టి కౌంటర్ ఇచ్చారు.

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ రాజకీయాలన్నీ ఎప్పుడూ సెన్సిటివ్‌గానే ఉంటాయి. హిందువులు మెజార్టీగానున్న మన దేశంలో మెజార్టీ ముస్లింలు ఉన్న కశ్మీర్‌ చుట్టూ ఉగ్రవాద శక్తులు కంచె అల్లడానికి కుయుక్తులు చేస్తూనే ఉన్నాయి. దీనికి తోడు పాకిస్తాన్ కూడా అవకాశం దొరికినప్పుడల్లా భారత్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. తాజాగా, జమ్ము కశ్మీర్‌లో వేర్పాటువాద నేత సయ్యద్ అలీ గిలానీ మరణాన్ని పాకిస్తాన్ సాకుగా చేసుకుంది.

పాకిస్తాన్ అనుకూల వేర్పాటువాద నేత గిలానీ(92) వయసు సంబంధ సమస్యలతో బాధపడుతూ బుధవారం రాత్రి మరణించారు. ఆయన మరణంతో కశ్మీర్‌లో కర్ఫ్యూలాంటి ఆంక్షలు అమలు అయ్యాయి. గిలానీని శ్రీనగర్‌లోని హైదర్‌పొరలో ఉదయం 4.30 గంటల  ప్రాంతంలో గిలానీ మృతదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. గిలానీ మరణంతో ఆయన నివాసం సమీపంలో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. ముందు జాగ్రత్తగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా కశ్మీర్ లోయలో నిలిపేశారు.

ఈ హురియత్ నేత రెండు దశాబ్దాలపాటు వేర్పాటువాద ఉద్యమాన్ని నడిపారు. హురియత్ కాన్ఫరెన్స్ సహవ్యవస్థాపకుడైనా ఈయన హురియత్ లీడర్‌గా దీర్ఘకాలం కొనసాగారు. అనంతరం భావజాలపరమైన విభేదాలతో అందులో నుంచి తప్పుకుని 2000లో తెహ్రీక్ ఈ హురియత్‌ను స్వయంగా ఏర్పాటుచేశారు. గతేడాది జూన్ వరకు దానికి సారథ్యం వహించారు. హురియత్ సుదీర్ఘకాలంలో కశ్మీర్ భవితవ్యంపై భారత ప్రభుత్వంతో చర్చలు జరపడానికి నిరాకరిస్తూనే రావడం గమనార్హం.

హురియత్ నేత గిలానీ మరణాన్ని ఆసరగా తీసుకుని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై బురదజల్లే పనిచేశారు. కశ్మీరీల ఫ్రీడమ్ ఫైటర్ గిలానీ మరణం తనను కలచివేసిందని, ఆయన కశ్మీరీల స్వయంనిర్ణయాధికారం కోసం, వారి హక్కుల కోసం పోరాడారని ట్వీట్ చేశారు. ఆయనను భారత ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని ఆరోపించారు. అంతేకాదు, ఆయన ధైర్యసాహసాలకు పాకిస్తాన్ సలామ్ చేస్తున్నదని, గిలానీకి సంతాపంగా పాకిస్తాన్ జాతీయ జెండాను సగం మేరకు అవనతం చేస్తామని పేర్కొన్నారు. ‘మేం పాకిస్తానీలం. పాకిస్తాన్ మాదే’ అనే నినాదాన్ని తాము ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నట్టు తెలిపారు.

పాకిస్తాన్ ప్రధానితోపాటు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ కూడా ఇదే తరహాలో స్పందించారు. కశ్మీర్ స్వాత్రంత్య ఉద్యమానికి ఆయన సారథి అని పేర్కొంటూ పాకిస్తాన్ ఆయనకు సంతాపం ప్రకటిస్తుందని ట్వీట్ చేశారు. గృహనిర్బంధంలో ఉన్నప్పటికీ ఆయన తుదిశ్వాస వరకూ కశ్మీరీ హక్కుల కోసం పోరాడారని పేర్కొన్నారు. పాకిస్తాన్ నేతల కుయుక్తులకు కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వీ గట్టి కౌంటర్ ఇచ్చారు. 

జిహాద్ పేరిట అమాయకపు కశ్మీరీలను తీవ్రవాదులుగా మార్చి వారి ప్రాణాలను బలిగొనడానికి భారత్‌లో సహకరించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నఖలును ఖరేషీ కోల్పోయారని అభిషేక్ మనుసింఘ్వీ ఖురేషీ ట్వీట్‌కు బదులిచ్చారు. అమాయకపు కశ్మీరీలను పొట్టనబెట్టుకున్నందుకు పాకిస్తాన్, సహా దాని ముసుగుదారులందరూ చరిత్రలో కలిసిపోతారని పేర్కొన్నారు.

click me!