గే లాయర్ పదోన్నతిపై కేంద్రంతో విబేధించిన సుప్రీంకోర్టు.. వివరాలను తొలిసారి బహిర్గతం చేసిన న్యాయస్థానం

By Mahesh KFirst Published Jan 19, 2023, 7:32 PM IST
Highlights

గే అడ్వకేట్ సౌరభ్ కిర్పాల్ పదోన్నతి కోసం సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉంచింది. ఈ సిఫారసును వ్యతిరేకిస్తూ కేంద్రం  చేసిన అభ్యంతరాలను, వాటికి కోర్టు వివరణను సుప్రీంకోర్టు తొలిసారి బహిరంగపరిచింది.
 

న్యూఢిల్లీ: సీనియర్ అడ్వకేట్, గే లాయర్‌ సౌరభ్ కిర్పాల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉద్యోగోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఐదేళ్ల క్రితం కేంద్రానికి సిఫారసు చేసింది. కానీ, ఈ సిఫారసు అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉన్నది. గే లాయర్‌ను హైకోర్టు న్యాయమూర్తిగా చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉన్నాయి. అందుకే సుప్రీంకోర్టు సిఫారసులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. కానీ, సుప్రీంకోర్టు కొలీజియం ఆ అభ్యంతరాలను కొట్టేసింది. వాటికి వివరణ ఇస్తూ.. మరో సారి అంటే మూడోసారి ఆయన పేరును సిఫారసు చేసింది. మరో సంచలన విషయం ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న అభ్యంతరాలను, అందుకు కొలీజియం వివరణలను సుప్రీంకోర్టు తొలిసారి బహిర్గతం చేసింది. సాధారణంగా సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు, వాటికి కొలీజియం వివరణలు ఎప్పుడూ రహస్యంగా ఉండేవి. కానీ, తొలిసారి సుప్రీంకోర్టు వాటిని బహిరంగపరిచింది.

గే అడ్వకేట్ సౌరభ్ కిర్పాల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసును కేంద్ర ప్రభుత్వం రెండు కారణాలతో అభ్యంతరం తెలిపి పెండింగ్‌లో ఉంచింది. ఆ అభ్యర్థి గే అని, ఆయన పార్ట్‌నర్ ఒక స్విట్జర్లాండ్ పౌరుడు అని వివరించింది. సుప్రీంకోర్టు ఈ అభ్యంతరాలను బహిరంగపరిచింది. అంతేకాదు, ఈ అభ్యంతరాలకు సుప్రీంకోర్టు కొలీజియం వివరణ కూడా వెల్లడి చేసింది.

Also Read: కొలీజియం వ్యవస్థలో ప్రాతినిధ్యం ఇవ్వండి.. సుప్రీంకోర్టుకు కేంద్రం లేఖ.. తప్పుబట్టిన అరవింద్ కేజ్రీవాల్

ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ప్రకారం, సౌరభ్ కిర్పాల్ భాగస్వామ్యి వ్యక్తిగత నడవడిక, ప్రవర్తన‌తో దేశభద్రతకు ముప్పు ఉండే అవకాశం లేదని కొలీజియం తన వివరణలో పేర్కొంది. కాబట్టి, సౌరభ్ కిర్పాల్ భాగస్వామితో దేశానికి ముప్పు అని భావించలేమని, అలాగే, స్విట్జర్లాండ్ కూడా మనకు మిత్రదేశమే అని సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, కేఎం జోసెఫ్‌లు సంతకం పెట్టిన లేఖ పేర్కొంది.

అంతేకాదు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న చాలా మందికి విదేశీ పౌరులైన భాగస్వాములు ఉన్నారని, అలాగే, గే పౌరుల హక్కులను సుప్రీంకోర్టు ఎత్తిపట్టిందని, వాటి ప్రకారం, ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించలేమని కోర్టు తెలిపింది. న్యాయమూర్తి పదవికి సరిపడా అర్హతలు ఆయనకు ఉన్నాయని, ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఆయనకు పదోన్నతి కల్పిస్తే బెంచ్‌లోనూ బహుళత్వం, సంఘటిత రూపం ఉంటుందని వివరించింది.

click me!