
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ అదానీ గ్రూప్‌నకు క్లీన్ చిట్ ఇచ్చింది. తమ ప్రాథమిక పరిశీలనలో ఎలాంటి ఉల్లంఘనలు కనిపించలేవని వివరించింది. హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణల నేపథ్యంలో రెగ్యులేటరీ మెకానిజాన్ని పరీక్షించడానికి సుప్రీంకోర్టు నిపుణులతో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ అదానీ గ్రూప్‌నకు క్లీన్ చిట్ ఇస్తూ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వైపునా ఎలాంటి రెగ్యులేటరీ వైఫల్యాలు లేవని వివరించింది.
అదానీ గ్రూప్‌నకూ సంబంధించి ఎలాంటి ప్రైస్ మ్యానిపులేషన్ లేదని వివరించింది. రిటేల్ ఇన్వెస్టర్ల కోసమూ అదానీ గ్రూప్ అవసరమైన నిర్ణయాలు తీసుకుందని తెలిపింది. తద్వార స్టాక్‌లో విశ్వాసం నిర్మించడానికి ఇది సహకరించిందని వివరించింది. తద్వార స్టాక్స్ ఇప్పుడు స్టేబుల్‌గా ఉన్నాయని పేర్కొంది.
‘సెబీ వివరణలు, సంఖ్యలు, ఇతర వివరాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాత రెగ్యులేటరీ వైఫల్యం ఉన్నదని తేల్చే స్థితిలో తమ కమిటీ లేదు. ప్రైస్ మ్యానిపులేషన్ కూడా జరిగిందనే ఆరోపణలను నిజం అని చెప్పలేం.’ అని సుప్రీంకోర్టుకు సమర్పించిన తన నివేదికలో ఈ కమిటీ పేర్కొంది. అదే విధంగా హేతుబద్ధమైన, సుస్థిరమైన, ప్రతిభావంతమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ పాలసీని సెబీ ఎంచుకుని అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపింది. కొన్ని పార్టీలు తరుచూ కృత్రిమ ట్రేడింగ్, వాష్ ట్రేడ్‌లకు పాల్పడినట్టు కనిపించలేవని వివరించింది.
Also Read: సావర్కర్ జయంతి రోజున నూతన పార్లమెంటు భవనం ప్రారంభం.. సోషల్ మీడియాలో చెలరేగిన రాజకీయం
హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్ పై చేసిన ఆరోపణలపై సెబీ దర్యాప్తు చేస్తున్నది. దీనికి సమాంతరంగా సుప్రీంకోర్టు ఈ నిపుణుల కమిటీ వేసింది. అయితే, హిండెన్ బర్గ్ రిపోర్టు వెలువడక ముందు కొన్ని కంపెనీలు షార్ట్ పొజిషన్ తీసుకున్నాయని, ఈ రిపోర్టు వెల్లడైన తర్వాత ధరలు పతనం అయిన తర్వాత లబ్ది పొందారని సెబీ కనుగొందని ఈ కమిటీ తెలిపింది. అయితే, దీనిపై సెబీ దర్యాప్తు జరుగుతున్నందున తాము ఎలాంటి వ్యాఖ్య చేయవద్దని నిర్ణయించుకున్నట్టు వివరించింది.
ఈ నిపుణుల కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ ఏఎం సప్రె, బాంబే హైకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ జేపీ దేవాధర్, ఎస్‌బీఐ మాజీ చైర్మన్ ఓపీ భట్, ఐసీఐసీఐ బ్యాంకక్ మాజీ చీఫ్ కేవీ కామత్, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేకణి, సెక్యూరిటీస్ అండ్ రెగ్యులేటరీ ఎక్స్‌పర్ట్ సోమశేఖర్ సుందరేశన్‌లు ఉన్నారు.
హిండెన్ బర్గ్ ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసి ఆగస్టు 14వ తేదీలోపు నివేదిక అందించాలని సెబీకి మరింత గడువును ఇస్తూ గత వారం సుప్రీంకోర్టు ఆదేశాలు చేసింది.