అసదుద్దీన్ ఒవైసీపై కాల్పుల కేసులో నిందితులకు ఝలక్.. బెయిల్ రద్దు చేస్తూ వారంలోగా లొంగిపోవాలని  సుప్రీం ఆర్డర్.

By Rajesh KarampooriFirst Published Nov 11, 2022, 2:38 PM IST
Highlights

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిపిన కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులకు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు శుక్రవారం రద్దు చేసింది. నిందితులను వారం రోజుల గడువు లోగా లొంగిపోవాలని ఆదేశించింది.

ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిపిన నిందితులకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. కానీ, సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది. నిందితులను వారం రోజుల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

దీంతో పాటు సాక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని నిందితుల బెయిల్ పిటిషన్‌పై తాజా నిర్ణయం తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టును కోర్టు కోరింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నందుకు శర్మ, గుర్జార్ మరియు ఆలీమ్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మూడో నిందితుడు అలీమ్‌కు మంజూరైన బెయిల్‌పై సవాల్‌ను సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు కొట్టివేసింది.

బెయిల్ ఇచ్చేటప్పుడు హైకోర్టు ఎలాంటి కారణం చెప్పలేదని న్యాయమూర్తులు ఎంఆర్ షా, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ అంశాన్ని మళ్లీ విచారించాలని పేర్కొంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సచిన్ శర్మ,శుభమ్ గుర్జార్‌లను వారంలోగా పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది.ఇద్దరు నిందితుల బెయిల్ దరఖాస్తులను లొంగిపోయిన తేదీ నుండి నాలుగు వారాల్లోగా తేల్చాలని హైకోర్టును ఆదేశించింది. అసదుద్దీన్‌ ఒవైసీ తనపై దాడి చేసిన నిందితులకు మంజూరు అయిన బెయిల్‌ను సవాలు చేస్తూ.. అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖాలు చేశారు. తనపై హత్యాయత్నం చేశారని, తనని లక్ష్యంగా చేసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.  

అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు

ఈ ఏడాది ఫిబ్రవరిలో అసదుద్దీన్‌ ఒవైసీ తనపై కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లో కిథోర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం ముగించుకుని సాయంత్రం ఓవైసీ కాన్వాయ్‌తో కారులో ఢిల్లీకి తిరిగి వస్తున్నారు. ఈ సమయంలో పిల్ఖువాలోని NH-9లో ఉన్న ఛిజార్సీ టోల్ ప్లాజా వద్ద ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే షూటౌట్‌లో ఒవైసీ తృటిలో తప్పించుకున్నారు. అదే సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులు నిందితులను పట్టుకున్నారు. దాడి చేసిన వారిని గౌతం బుద్ నగర్‌లోని బాదల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దురై గ్రామానికి చెందిన సచిన్, సహరాన్‌పూర్‌లోని సపాలా నివాసి శుభమ్‌గా గుర్తించారు.
 
కాల్పులు జరిగిన విషయాన్ని ఒవైసీ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ట్వీట్‌లోని ఒక ఫోటోలో, కారులో బుల్లెట్ రంధ్రాలు కనిపిస్తాయి. కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారని ఒవైసీ అన్నారు. దాడి చేసిన వారు ఆయుధాలు వదిలి పారిపోయారు. కాల్పుల్లో కారు పంక్చర్ అయింది.అందరూ సురక్షితంగా ఉన్నారు. అని పేర్కొన్నారు.

click me!