మహా అసెంబ్లీలో బలపరీక్ష: శివసేన పిటిషన్ పై నేడు ఐదు గంటలకు సుప్రీంలో విచారణ

By narsimha lodeFirst Published Jun 29, 2022, 11:07 AM IST
Highlights

ఈ నెల 30వ తేదీన అసెంబ్లీలో బల పరీక్ష జరపాలని గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. బుధవారం నాడు సాయంత్రం ఐదు గంటలకు ఈ పిటిషన్ పై విచారణ ,చేస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. 

న్యూఢిల్లీ:  ఈ నెల 30వ తేదీన అసెంబ్లీలో బల పరీక్ష జరపాలని గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన దాఖలు చేసిన పిటిషన్ పై  సుప్రీంకోర్టు బుధవారం నాడు సాయంత్రం ఐదు గంటలకు విచారణ చేయనుంది. 

ఈ విషయాన్ని అత్యవసరంగా విచారించాలని సీనియర్ అడ్వకేట్ ఎం సింఘ్వి సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు.అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ పిటిషన్ పై ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు విచారణ చేయనున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.  అదే సమయంలో ఇవాళ సాయంత్రం మూడు గంటల లోపుగా ఈ పిటిషన్ కు సంబంధించి అన్ని పత్రాలను కోర్టుకు సమమర్పించాలని కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.రేపు బలపరీక్ష నిర్వహించాలన్న నోటీసు ఇవాళ ఉదయం మాత్రమే అందిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ నెల 30వ తేదీ లోపుగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సీఎం ఉద్దవ్ ఠాక్రేను కోరారు. ఈ ప్రక్రియను రికార్డు చేయాలని కూడా ఆయన ఆదేశించారు.  ఈ మేరకు అసెంబ్లీని ఈ నెల 30న ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా సమావేశపర్చాలని కూడా గవర్నర్ అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించారు. ఈ మేరకు గవర్నర్ అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాశారు.  ఈ లేఖ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు కానున్నాయి. గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే న్యాయ నిపుణులతో చర్చించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ బల నిరూపణ చేసుకోవాలని ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్ దాఖలు చేసింది. 

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో  మాజీ సీఎం, బీజేపీ నేత దేవేద్ర ఫడ్నవీస్ ఇటీవలనే భేటీ అయ్యారు. మరో వైపు మంగళవారం నాడు బీజేపీ అగ్రనేతలతో  ఫడ్నవీస్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు వివరించారు.  

మహారాష్ట్రలో శివసేనలో చోటు చేసుకొన్న సంక్షోభాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తుంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ అడుగులు చూస్తే ఇదే రకమైన అభిప్రాయం కలుగుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. శివసేన రెబెల్ వర్గాన్ని కలుపుకొని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు అసోంలోని గౌహతిలోనే ఉన్నారు. రేపు అసెంబ్లీలో బల పరీక్ష నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో అసమ్మతి  ఎమ్మెల్యేలు అసోం నుండి ముంబైకి రానున్నారు. ఇప్పటికే అసమ్మతి ఎమ్మెల్యేలు తాము ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతును ఉపసంహరించుకొన్నామని కూడా లేఖ పంపారు. 

శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు  మంగళవారం నాడు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే లేఖ రాశారు. సమస్యను పరిష్కరించుకుందామని ఆయన  ఆ లేఖలో పేర్కొన్నారు. ముంబైకి రావాలని కూడా కోరారు. మరో వైపు అసమ్మతి ఎమ్మెల్యేల్లో కొందరు తమతో టచ్ లో ఉన్నారని కూడా ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రకటించింది. ఈ ప్రకటనను ఏక్‌నాథ్ షిండే తోసిపుచ్చుతున్నారు.

click me!