గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం బ్లండర్ మిస్టేక్: జమ్ము కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం

By Mahesh KFirst Published Dec 24, 2022, 8:42 PM IST
Highlights

గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం తాము చేసిన పెద్ద తప్పు అని జమ్ము కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారాచంద్ పేర్కొన్నారు. ఆజాద్ పార్టీ బహిష్కరించిన రెండు రోజుల తర్వాత ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తమకే నిర్ణయం తీసుకునే హక్కు ఇచ్చేదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తనను చట్టసభ్యుడిని, స్పీకర్, డిప్యూటీ సీఎంను చేసిందని వివరించారు. ఈ రోజు డీఏపీ తమను ద్రోహం చేసిన తర్వాత తాము కాంగ్రెస్‌కు ద్రోహం చేశామనే ఆలోచనలు వస్తున్నాయని తెలిపారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు.
 

జమ్ము: గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం మేం చేసిన పెద్ద తప్పు అని జమ్ము కశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి తారాచంద్ తాజాగా పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. గులాం నబీ ఆజాద్‌తో తాము దీర్ఘకాలం ప్రయాణించామని, ఆయన రాజీనామా చేసినప్పుడు ఆయనతోపాటే నిలబడి నైతిక ధైర్యం ఇవ్వాలని భావించామని వివరించారు. అందుకే తాము కూడా రాజీనామా చేశామని పేర్కొన్నారు.

తారాచంద్‌, మాజీ మంత్రి మనోహర్ లాల్ శర్మ, మాజీ చట్టసభ్యులు బల్వాన్ సింగ్‌లను గులాం నబీ ఆజాద్ సారథ్యంలోని డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ బహిష్కరించింది. డీఏపీ ఈ చర్య తీసుకున్న తర్వాత రెండు రోజులకు తారాచంద్ మాట్లాడారు. తమను ఎలాంటి కారణాలు లేకుండానే బహిష్కరించడం తమకు షాక్ కలిగించిందని అన్నారు. ఆజాద్‌కు మద్దతుగా తాము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం ఇప్పుడు తమ తప్పిదమే అని తెలుస్తున్నదని వివరించారు.

Also Read: ఆజాద్ పార్టీలో కల్లోలం.. ముగ్గురు బడా నేతల బ‌హిష్క‌ర‌ణ‌.. కార‌ణం ఏంటంటే..?

కాంగ్రెస్ పార్టీ తమకే నిర్ణయం తీసుకునే హక్కు ఇచ్చేదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తనను చట్టసభ్యుడిని, స్పీకర్, డిప్యూటీ సీఎంను చేసిందని వివరించారు. ఈ రోజు డీఏపీ తమను ద్రోహం చేసిన తర్వాత తాము కాంగ్రెస్‌కు ద్రోహం చేశామనే ఆలోచనలు వస్తున్నాయని తెలిపారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. తాము జమ్ము కశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడితో విబేధించినా పార్టీ తమకు నోటీసులు ఇవ్వలేదని తెలిపారు.

తాము లౌకికవాదులం అని, చివరి శ్వాస వరకు సెక్యులర్‌గానే ఉంటామని అన్నారు. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ తమను అప్రోచ్ కాలేదని తెలిపారు. మతపరమైన పార్టీలకు దూరంగా ఉంటామని చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లాలు భారత్ జోడో యాత్ర జమ్ము కశ్మీర్ చేరిన తర్వాత పాదయాత్రలో చేరాలనే కోరిక వెలిబుచ్చారని పేర్కొనగా.. తాము కూడా రాహుల్ గాంధీ యాత్రలో పాలుపంచుకోవడానికి వెనుకాడబోమని వివరించారు.

click me!