దేశమంతా ద్వేషం లేదు.. అది టీవీ చానెళ్లలోనే ఉన్నది.. పాదయాత్రతో స్పష్టమైంది: ఎర్రకోటపై రాహుల్ గాంధీ

By Mahesh KFirst Published Dec 24, 2022, 7:33 PM IST
Highlights

రాహుల్ గాంధీ ఈ రోజు ఎర్రకోట మీది నుంచి ప్రసంగిస్తూ టీవీల్లో చూపిస్తున్నట్టు దేశమంతా విద్వేషం లేదని అన్నారు. తన పాదయాత్రలో ఇదే తెలిసిందని, లక్షలాది మంది తనతో కలిసి నడిచారని, వారంతా ప్రేమ ఆప్యాయతలతోనే మెలిగారని వివరించారు. ఒకరినొకరు గౌరవించుకున్నారని తెలిపారు. కేవలం టీవీల్లోనే 24 గంటలు విద్వేషం, హింస ఉంటున్నదని, హిందూ ముస్లిం అనే భేదాలు ఉన్నాయని పేర్కొన్నారు.
 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయానాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సారథ్యంలో సాగుతున్న భారత్ జోడో పాదయాత్ర ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించింది. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలతోపాటు మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా యాత్రలో పాల్గొన్నారు. అనంతరం, రాహుల్ గాంధీ ఎర్రకోట మీద ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మత సామరస్యం, విద్వేషంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు.

దేశమంతటా విద్వేషం ఉన్నదనే భ్రమ ఈ యాత్ర మొదలు పెట్టడానికి ముందు తన మైండ్‌లో ఉన్నదని రాహుల్ గాంధీ అన్నారు. కానీ, తాను పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత అది వట్టి అబద్ధం అని స్పష్టం అవుతూ వచ్చిందని వివరించారు. తాను 2,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చానని తెలిపారు. కానీ, తాను ఎక్కడా ద్వేషం చూడలేదని తెలిపారు.  కానీ, టీవీ ఆన్ చేస్తే ఎప్పుడూ హింస, విద్వేషమే కనిపిస్తుందని చెప్పారు. అది మీడియా మిత్రుల పని కాదని, వెనుక ఉండి నడిపించే శక్తులే రోజులో 24 గంటలు టీవీ చానెళ్లలో విద్వేషాన్ని ప్రసారం చేయిస్తున్నాయని ఆరోపించారు. తద్వార దేశంలోని వాస్తవ సమస్యలపైకి ప్రజల దృష్టి వెళ్లకుండా చేస్తున్నారని అన్నారు.

దేశమంతా విద్వేషం లేదని, తన పాదయాత్రతో ఇది స్పష్టమైందని వివరించారు. ఈ దేశాన్ని ఏకం చేయాలనే ఏకైక లక్ష్యం మనసులో ఉంచుకుని ఈ యాత్ర మొదలు పెట్టానని తెలిపారు. తన యాత్రలో లక్షలాది మందిని కలిశానని, వారంతా ఒకరిపట్ల మరొకరు ప్రేమతో ఉన్నారని, సామరస్యంగా మెలిగారని, ఒకరిపై ఒకరు ఆప్యాయతను కురిపించుకున్నారని వివరించారు. భారత్ అంటే ఇదే అని చెప్పారు. భారతదేశం ఎప్పటికీ ఒకటే అని అన్నారు.

Also Read: భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్.. ఢిల్లీలో రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర

ఎర్రకోట నుంచి చుట్టూ చూపిస్తూ.. ఇక్కడ అన్ని మతాల ప్రజలు కలిసే ఉంటారని, అదిగో అటు చూడండి.. అక్కడ జైన మందిరం, ఇది మందిరం, అది గురుద్వార, మసీదులు ఉన్నాయి. ఇదే భారత దేశం’ అని చెప్పారు.

తన ఇమేజ్‌ను నష్టపరచడానికి బీజేపీ వాళ్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, కానీ తాను ఒకే నెలలో నిజమేంటో ఈ దేశానికి చూపించానని రాహుల్ గాంధీ అన్నారు.

ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదని, అదానీ, అంబానీ ప్రభుత్వం అని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వం సంపన్నులకు కొమ్ము కాసే ప్రభుత్వం అని పేర్కొన్నారు. ధనికులకు లక్ష కోట్ల రుణాలు ఇస్తుందని, అదే రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు ఇవ్వరని ఆరోపించారు.

ఈ యాత్రలో పాల్గొన్న కమల్ హాసన్ మాట్లాడుతూ, భారత్ జోడో యాత్రలో పాల్గొనడం, రాహుల్ గాంధీతో నడవడం రాజకీయంగా మీరు చేసే పెద్ద తప్పిదం అవుతుంది అని కొందరు తనకు చెప్పారని కమల్ హాసన్ అన్నారు. ‘కానీ,  నా అంతరాత్మకు నేను ఇలా చెప్పుకున్నాను. ఈ సమయంలో నా దేశానికి నేను అవసరం. నా అంతరాత్మ చెప్పింది.. కమల్, భారత్‌ను విచ్ఛిన్నం చేయడానికి కాదు.. భారత్ ఏకం చేయడానికి సహాయపడు’ అని కమల్ తెలిపారు.

click me!