గవర్నర్‌ను కలిసిన సుఖ్వీందర్ సింగ్ .. రేపు హిమాచల్‌ప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం

By Siva KodatiFirst Published Dec 10, 2022, 9:24 PM IST
Highlights

హిమాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధిష్టానం నుంచి నిర్ణయం వెలువడిన వెంటనే ఆయన గవర్నర్‌తో భేటీ అయ్యారు. 
 

హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం ఎవరంటూ గత కొన్నిరోజులుగా సాగుతున్న సస్పెన్స్‌కు కాంగ్రెస్ పార్టీ శనివారం తెరదించింది. సుదీర్ఘ కసరత్తు, సామాజిక సమీకరణల అనంతరం ఆ రాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయానికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. అనంతరం సుఖ్వీందర్ సింగ్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక సీఎల్పీ మాజీ నేత ముఖేష్ అగ్నిహోత్రికి డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించింది. 

ఇకపోతే.. సుఖ్వీందర్ సింగ్ హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్‌లో సీనియర్ నేతల్లో ఒకరు. నాదౌన్ అసెంబ్లీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 2013 - 19 మధ్య కాలంలో హిమాచల్‌ప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసిన సుఖ్వీందర్... గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. 

ALso Read:సీఎం రేసులో ఆ ముగ్గురు.. ఉత్కంఠ భరితంగా హిమాచల్‌ప్రదేశ్‌ రాజకీయాలు..

ఇదిలావుండగా.. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయినప్పటికీ, హిమాచల్ ప్రదేశ్‌లోని 68 సీట్లలో 40 సీట్లను గెలుచుకుంది. ఈ విజయంతో బీజేపీని అధికారం నుంచి దింపి కాంగ్రెస్ అధికారం చేపట్టనున్నది.గుజరాత్‌లో ఘోర పరాజయం తర్వాత హిమాచల్‌లో కూడా కాంగ్రెస్‌ ఓటమి పాలైతే రానున్న కాలంలో కాంగ్రెస్‌కు సవాల్‌ మరింత పెరిగేది. హిమాచల్‌లో గెలవకపోతే ఎక్కడ గెలుస్తుందో... ఇది ఓ కాంగ్రెస్ నేత చేసిన ప్రకటనను బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే.. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించిన ప్రియాంక గాంధీ కూడా ప్రధానం కారణం. ప్రియాంక గాంధీతో పాటు రాష్ట్ర ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లాపై కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

హిమాచల్‌లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభా సింగ్‌ కీలక పాత్ర పోషించింది . అయితే.. ఆమె  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయినప్పటికీ ఆమె సీఎం రేసులో నిలిచారు. ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోయినా.. పార్టీ గెలుపులో ఆమె కృషి ఎంతగానో ఉంది. అదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కుల్దీప్ సింగ్ రాథోడ్ కూడా ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. కానీ అధిష్టానం మాత్రం సుఖ్వీందర్‌ వైపే మొగ్గు చూపింది. 

click me!