జూన్ 20లోపు పెగాసెస్ రిపోర్టు సమర్పించండి: సుప్రీంకోర్టు.. ‘29 మొబైళ్లను పరీక్షించాం’

By Mahesh KFirst Published May 20, 2022, 1:03 PM IST
Highlights

స్పైవేర్ పెగాసెస్‌పై భారత్‌లో వచ్చిన ఆరోపణలపై విచారించడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీని వచ్చే నెల 20వ తేదీలోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది. జూలైలో తదుపరి విచారణ ఉంటుందని తెలిపింది.
 

న్యూఢిల్లీ: స్పైవేర్ పెగాసెస్ అంశం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ విమర్శకులపై ఈ స్పైవేర్ ద్వారా నిఘా పెట్టారనే ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రవీంద్రన్ సారథ్యంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ వేసింది. ఈ కమిటీ నివేదికను సమర్పించడానికి మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టును అడిగింది. తాజాగా, సుప్రీంకోర్టు ఇందుకు అంగీకరించింది. పెగాసెస్‌పై రిపోర్టును జూన్ 20వ తేదీ లోపు సమర్పించాలని జస్టిస్ రవీంద్రన్ కమిటీని ఆదేశించింది.

ఇప్పటి వరకు 29 మొబైల్ డివైజ్‌లను పరీక్షించామని రవీంద్రన్ కమిటీ సుప్రీంకోర్టుకు తెలిపింది. అనేక మంది జర్నలిస్టులు, నిపుణులతో తాము చర్చించామని వివరించింది. టెక్నికల్ కమిటీ పెగాసెస్‌పై రిపోర్టును ఈ నెలాఖరులోగా రవీంద్రన్ కమిటీకి అందజేయనుంది. ఆ తర్వాత ఫైనల్ రిపోర్టును జూన్ 20లోగా సుప్రీంకోర్టుకు ఈ కమిటీ సమర్పించనుంది.

మొబైల్, ఇతర డివైజ్‌లను పరీక్షించడానికి టెక్నికల్ కమిటీ ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసుకుందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ కమిటీ టెక్నికల్ ఆస్పెక్ట్ పూర్తయిపోయాక ఆ రిపోర్టును జస్టిస్ రవీంద్రన్ కమిటీకి అందిస్తుంది. మే నెల చివరిలోగా ఈ రిపోర్టు అందించే అవకాశం ఉన్నది. జస్టిస్ రవీంద్రన్ కమిటీ ఈ రిపోర్టును పరిశీలించి తుది రిపోర్టును సుప్రీంకోర్టుకు జూన్ 20లోగా సమర్పిస్తుంది. అనంతరం, సీజేఐ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం ఈ రిపోర్టును పరిశీలిస్తుంది. తదుపరి విచారణ జూలైలో ఉంటుంది.

17 మీడియా సంస్థలు సంయుక్తంగా పెగాసెస్ ప్రాజెక్ట్‌పై పరిశోధనలు చేసింది. పెగాసెస్ స్పైవేర్ ద్వారా మంత్రులు, విపక్ష నేతలు, రాజకీయ వ్యూహకర్తలు, జర్నలిస్టులు, కార్యకర్తలు, మైనార్టీ నేతలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఆధ్యాత్మిక నేతలు, సీబీఐ సారథులు సహా పలువురిపై నిఘా పెట్టినట్టు ఈ ప్రాజెక్ట్ రిపోర్టు ఆరోపించింది. ఈ రిపోర్టు ఆధారంగా ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. కానీ, ఈ ఆరోపణలను కేంద్రం ఖండించింది.

click me!