హిజాబ్ తీసేయండి.. స్కూల్ గేటు బయటే విద్యార్థుల అడ్డగింత.. తొలగించినవారికే లోనికి అనుమతి.. (వీడియో)

Published : Feb 14, 2022, 04:19 PM ISTUpdated : Feb 14, 2022, 04:24 PM IST
హిజాబ్ తీసేయండి.. స్కూల్ గేటు బయటే విద్యార్థుల అడ్డగింత.. తొలగించినవారికే లోనికి అనుమతి.. (వీడియో)

సారాంశం

కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై తుది తీర్పు వెలువడే వరకు పాఠశాలలకు ఎలాంటి మతాన్ని వ్యక్తీకరించే దుస్తులను అనుమతించరాదని మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం పాఠశాల గేట్ల ముందు ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. హిజాబ్ ధరించి కొందరు విద్యార్థులు స్కూళ్లకు రాగా.. ఆ హిజాబ్ తొలిగించాకే సిబ్బంది వారిని పాఠశాలలకు అనుమతించింది.  

బెంగళూరు: హిజాబ్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో మొదలైన ఈ వివాదం ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాల వరకూ చేరిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై తుది తీర్పు వెలువడే వరకు పాఠశాలల్లో మతాన్ని వ్యక్తీకరించే దుస్తులు వేసుకురావద్దని కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను అమలు చేస్తూ ఈ రోజు పాఠశాలలకు హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను స్టాఫ్ అడ్డుకుంది. స్కూల్ గేటు బయటే వారిని నిలిపేసింది. హిజాబ్ తొలగించిన వారినే పాఠశాలలకు అనుమతించిన ఘటనకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

మాండ్య జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల గేటు బయట కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి వచ్చారు. వారిని స్కూల్‌లోనికి అనుమతించడానికి స్టాఫ్ ససేమిరా అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు హిజాబ్ తొలగించే పాఠశాలలకు రావాలని ఉపాధ్యాయులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివరించారు. ఈ విషయమై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం జరిగింది. వేడి వేడిగా వారి మధ్య వాగ్వాదాలు జరిగాయి. తమ పిల్లలను హిజాబ్ ధరించే స్కూల్‌లోకి అనుమతించాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు. కనీసం తరగతి గది వరకైనా తమ పిల్లలను హిజాబ్ ధరించే వెళ్లడానికి అనుమతించాలని, క్లాసు రూమ్‌లో వారు తమ హిజాబ్ తొలగిస్తారని చెప్పారు. అయినప్పటికీ ఆ ఉపాధ్యాయులు వారిని అనుమతించలేదు. స్కూల్ బయటే హిజాబ్ తొలగించాలని స్పష్టం చేశారు.

డిసెంబర్‌లో హిజాబ్ వివాదం మొదలైన ఉడిపి జిల్లాలోనూ ఈ నిబంధన కచ్చితత్వంతో అమలైంది. ఉడిపిలోని ఓ స్కూల్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని మాట్లాడుతూ, తాను తన మిత్రురాలు ఇద్దరినీ హిజాబ్‌ను తొలగించిన తర్వాతే స్కూల్‌లోకి అనుమతించారని వివరించింది.

ఇదిలా ఉండగా, శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 13 మంది విద్యార్థులు ఎస్‌ఎస్‌ఎల్‌సీ (10వ తరగతి) ప్రిపరేటరీ పరీక్షకు హిజాబ్ తొల‌గించి.. హాజరు కావడానికి నిరాకరించారు. ప‌రీక్ష‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్నామ‌ని పేర్కొన్నారు. 

శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ పబ్లిక్ స్కూల్ (Government High School) లో విద్యార్థులను ఉపాధ్యాయులు అడ్డుకుని హిజాబ్‌ను తొలగించాలని కోరారు. అయితే విద్యార్థులు హిజాబ్‌ను తీసివేయ‌డానికి పూర్తిగా నిరాకరించారు. తమను పరీక్షలు రాయడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. హిజాబ్ లేకుండా ప్రత్యేక గదిలో పరీక్షలు (SSLC-Class 10) రాయమని టీచర్లు, స్కూల్ యాజమాన్యం వారిని ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే, విద్యార్థులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. పరీక్షల‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అక్కడి పాఠశాలకు చేరుకున్న బాలికల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు అండగా ఉండి హిజాబ్ (Hijab) లేకుండా తరగతులకు హాజరుకాలేమని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు.

PREV
click me!

Recommended Stories

ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?
పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu