
Karnataka hijab row: కర్నాటకలోని పలు విద్యాసంస్థల్లో రాజుకున్న హిజాబ్ (Hijab) వివాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నది. ఈ నేపథ్యంలోనే శివమొగ్గలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిజాబ్ తొలగించి.. స్కూల్ తరగతులకు హాజరుకావడానికి పలువురు ముస్లిం విద్యార్థులు నిరాకరించారు. హిజాబ్ ధరించిన వారిని కూడా స్కూల్ లోపలికి రావడానికి అనుమతించాలని ముస్లిం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివరాల్లోకెళ్తే.. హిజాబ్ వివాదంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో కర్నాటకలో మూతపడిన విద్యాసంస్థలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. కొంతమంది విద్యార్థులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించే ముందు హిజాబ్‌లను తొలగించాలని యాజమాన్యాలు కోరారు. విద్యాసంస్థలు తిరిగి తెరవవచ్చు.. కానీ మతపరమైన దుస్తులు అనుమతించబడవని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా తాము చర్యలు తీసుకుంటున్నామని తెలిపాయి.
అయితే, హిజాబ్ ధరించిన తమ పిల్లలను స్కూల్ లోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ... వాదనలు చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో కొంత మంది విద్యార్థులు హిజాబ్ తీసివేసి పాఠశాలలోకి వెళ్లడం కనిపించింది. మరికొంత మంది హిజాబ్ ధరించిన తమను బడిలోకి అనుమతించాలని కోరుతున్న దృశ్యాలు కనిపించాయి. హిజాబ్ ధరించిన ఓ విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. "విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించాలని మేము పాఠశాల పరిపాలనను అభ్యర్థిస్తున్నాము. తరగతి గదుల్లోకి ప్రవేశించిన తర్వాత విద్యార్థులు హిజాబ్‌ను తీసివేయవచ్చు, కానీ ఉపాధ్యాయులు మా మాట వినడం లేదు. మా పిల్లలను లోపలికి అనుమతించడం లేదు" అని అన్నారు.
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్లపాటు మూతపడిన విద్యాసంస్థలు రాష్ట్రంలో తిరిగి తెరిచిన తర్వాత కొన్ని రోజులకే కర్నాటకలో హిజాబ్ వివాదం రాజుకుంది. రాష్ట్రంలోని ఉడిపిలోని కాలేజీల్లో కాలేజీ అధికారులు, విద్యార్థినులను హిజాబ్ ధరించడానికి అనుమతించకపోవడం, కాషాయ దుస్తులు ధరించిన విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయవలసి వచ్చింది. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో తిరిగి తెరుచుకున్నాయి.
ఇదిలావుండగా, Karnataka లోని శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ పబ్లిక్ స్కూల్ (Government High School) లో విద్యార్థులను ఉపాధ్యాయులు అడ్డుకుని హిజాబ్‌ను తొలగించాలని కోరారు. అయితే విద్యార్థులు హిజాబ్‌ను తీసివేయడానికి పూర్తిగా నిరాకరించారు. తమను పరీక్షలు రాయడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. హిజాబ్ లేకుండా ప్రత్యేక గదిలో పరీక్షలు (SSLC-Class 10) రాయమని టీచర్లు, స్కూల్ యాజమాన్యం వారిని ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే, విద్యార్థులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అక్కడి పాఠశాలకు చేరుకున్న బాలికల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు అండగా ఉండి హిజాబ్ (Hijab) లేకుండా తరగతులకు హాజరుకాలేమని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు.