
బెంగళూరు: పోలీసు అధికారిపై దాడి చేసిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విద్యార్థిపై మోపబడిన అభియోగాలను అతడి తండ్రి ఖండించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాలు.. మౌనేష్ అనే విద్యార్థి తుమకూరు రోడ్డులోని ఓ డెంటల్ కళాశాలలో చదువుతున్నాడు. అతడు కళాశాలకు వెళ్లేందుకు ఉదయం గంగమ్మ గుడి సర్కిల్ వద్ద బీఎంటీసీ బస్సు ఎక్కాడు. టికెట్ తీసుకోవాలని కండక్టర్ అశోక్ చెప్పగా.. పాస్ ఉందని విద్యార్థి మౌనేష్ చెప్పాడు.
అప్పుడు బస్ పాస్ చూపించమని కండక్టర్ సూచించాడు. మౌనేష్ బస్ పాస్‌ను చూపించగా.. కళాశాల గుర్తింపు కార్డు చూపించమని కండక్టర్ అడిగాడు. అతను గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీని చూపించాడు. అయితే కండక్టర్ మాత్రం ఒరిజినల్ ఐడీ చూపించాలని కోరాడు. ఈ క్రమంలోనే కండక్టర్, మౌనేష్‌లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత బస్సు డ్రైవర్.. బస్సును ఆపి గొడవను పరిష్కరించే ప్రయత్నం చేశాడు. అయితే డ్రైవర్‌తో కూడా మౌనేష్ దురుసుగా ప్రవర్తించాడనే ఆరోపణలున్నాయి.
ఈ గొడవతో కోపోద్రిక్తుడైన బస్సు డ్రైవర్.. బస్సును అదే మార్గంలో ఉన్న పీణ్య పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. బస్సు దిగిన తర్వాత డ్రైవర్, కండక్టర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఘటనపై ఫిర్యాదు చేశారు. ఇంతలో తన సోదరుడు శరత్‌కు ఫోన్ చేసిన మౌనేష్.. తనతో బీఎంటీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌లు గొడవ పడ్డారని తెలిపాడు. దీంతో అక్కడికి చేరుకున్న శరత్.. పోలీసు స్టేషన్‌లో నానా హంగామా సృష్టించాడు. ఈ క్రమంలోనే మౌనేష్, అతడి సోదరుడు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ (పీఎస్‌ఐ)పై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం మౌనేష్‌ను పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అశోక్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే మౌనేష్‌పై పోలీసులు చేస్తున్న ఆరోపణలను అతడి తండ్రి ఖండించారు.