
న్యూఢిల్లీ: కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) ముంగిట్లోకి చేరింది. కర్ణాటక హైకోర్టు(Karnataka Highcourt) ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఓ స్టూడెంట్ పిటిషన్ వేశారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని, అలాగే, హిజాబ్ వివాదంపై హైకోర్టుకు చెందిన త్రిసభ్య ధర్మాసనం చేపడుతున్న విచారణపైనా స్టే విధించాలని కోరారు. కర్ణాటక హైకోర్టు ఆదేశాలతో ముస్లిం విద్యార్థుల హక్కులు ప్రశ్నార్థకంగా మారాయని, ముఖ్యంగా ముస్లిం బాలికల చదువు ప్రశ్నార్థకంగా మారే ముప్పు ఉన్నదని, ఇది వారి కెరీర్‌నే దెబ్బ తీస్తుందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితు రాజ్ అవస్థీ సారథ్యంలోని న్యాయమూర్తులు జస్టిస్ క్రిష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ ఖాజీ జైబున్నీసా మొహియుద్దీన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేస్తున్నది. ఈ ధర్మాసనం గురువారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. హిజాబ్ వివాదాన్ని త్రిసభ్య ధర్మాసనం విచారిస్తున్నదని, ఈ విచారణ పూర్తయ్యే వరకు విద్యార్థులు మతాన్ని వ్యక్తీకరించే దుస్తులు అంటే.. హిజాబ్ అయినా.. లేదా ఇతర కండువాలు అయినా ధరించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఇతరులను రెచ్చగొట్టే పరిస్థితులు ఉన్న ఇలాంటి దుస్తులకు దూరంగా ఉండాలని తెలిపింది. ముందుగా రాష్ట్రంలోని శాంతి భద్రతలు, సంయమాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొంది. అనంతరం ఈ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
అదే సందర్భంలో పాఠశాలలను మూసేయడం సరైన నిర్ణయం కాదని, కాబట్టి, తగిన చర్యలు తీసుకుని తరగతులు నిర్వహించాలని అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవదాగిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. హిజాబ్ వివాదం పెనుమంటలా వ్యాపిస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం పాఠశాలలు మూసేయాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఉన్నత పాఠశాలలు, కాలేజీలకు బుధవారం నుంచి మూడు రోజులు సెలవు ఇవ్వాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మంగళవారం ఆదేశించారు.
హిజాబ్ వివాదం ఎక్కడ ప్రారంభమైంది..
గతనెలలో ఉడిపిలోని ప్రభుత్వ కళాశాలలో ఈ వివాదం ప్రారంభమైంది. ఆరుగురు విద్యార్థినీలు నిర్దేశించిన దుస్తుల కోడ్‌ను ఉల్లంఘించి హిజాబ్‌లు ధరించి తరగతులకు వచ్చారు. తర్వాత నగరంలోని మరికొన్ని కళాశాలల్లో సమీపంలోని కుందాపూర్, బిందూర్‌లలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఆంశానికి వ్యతిరేకంగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి.. కళాశాలకు ప్రవేశించారు. తాము కండువా ధరించి వస్తామనీ తెలిపారు. కానీ వ్యతిరేకించడంతో తమను తరగతుల నుండి నిషేధించారని ఆరోపించడంతో హిజాబ్ నిరసనలు ప్రారంభించారు. ఉడిపి, చిక్కమగళూరులోని రైట్‌వింగ్ గ్రూపులు ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించాయి. ఈ నిరసనలు ఉడిపిలో ఉన్న మరిన్ని కళాశాలలకు వ్యాపించాయి.
ఈ క్రమంలో ఫిబ్రవరి 8 (మంగళవారం) ఉడిపిలోని ఒక ప్రభుత్వ కళాశాలలో ఇన్‌స్టిట్యూట్‌లో హిజాబ్‌ను నిషేధించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. పిటిషన్ దాఖాలు చేశారు. ఈ పిటిషన్‌లను కర్ణాటక హైకోర్టు విచారిస్తున్నది. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ డిక్రీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ను ఉల్లంఘించడమేనని, దాని ప్రకారం మత స్వేచ్ఛ ఉందని విద్యార్థి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.