విచిత్రం : వర్షాలు కురవాలని.. మద్యం,మాంసం నైవేద్యం..గుళ్లోనే తాగి,తినే సంప్రదాయం...

By AN TeluguFirst Published Aug 10, 2021, 10:48 AM IST
Highlights

మదురై జిల్లా మేలూరు సమీపంలో వర్షాలు కురవాలని మద్యం బాటిళ్లతో.. కోడి మాంసం నైవేద్యంగా సమర్పించి, పురుషులు మాత్రమే పాల్గొనే వినూత్న వేడుక జరిగింది. 

అదో విచిత్రమైన సంప్రదాయం.. పురుషులు మాత్రమే పాల్గొనే వేడుక. మందు, విందుతో దేవుడికి నైవేద్యం పేరుతో మజా చేసే సంస్కృతి.  పూర్వీకుల పేరుతో.. ఆచారం పేరుతో ఇప్పటికీ కొనసాగుతోంది ఈ తంతు.. ఇంతకీ ఏంటా సంప్రదాయం అంటే.. వానలు బాగా పడాలంటూ గుళ్లో దేవుడికి మందు, మాంసం నైవేద్యంగా సమర్పించి.. ఎంచక్కా ఆరగించడమే.. 

చెన్నై, పెరంబూర్ లో ఈ వింత ఆచారం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఓ వైపు కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు, వరదలతో జనజీవనం అతలాకుతలం అవుతుంటే.. మరోవైపు చెన్నైలో వర్షాలు కురవడం లేదంటూ.. వానలు పడాలంటూ వీరు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. 

మదురై జిల్లా మేలూరు సమీపంలో వర్షాలు కురవాలని మద్యం బాటిళ్లతో.. కోడి మాంసం నైవేద్యంగా సమర్పించి, పురుషులు మాత్రమే పాల్గొనే వినూత్న వేడుక జరిగింది. ఎట్టిమంగళం లోని ప్రాచీనమైన సక్కివీరన్‌ ఆలయానికి మద్యం బాటిళ్లతో వెళ్లి కోడిమాంసం నైవేద్యంగా సమర్పించి.. వర్షాలు కురవాలని కోరుతూ పురుషులు మాత్రమే పాల్గొనే వేడుకలు పారంపర్యంగా సాగుతున్నాయి.

ఆలయానికి భక్తులు సమర్పించే కోళ్లను బలి ఇచ్చి.. మట్టిపాత్రలో మాంసం వేసి వండుతారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో మద్యం బాటిళ్లను పేర్చుతారు. మద్యం అలవాటు ఉన్న భక్తులకు మాత్రమే బాటిళ్లు అందజేస్తారు. ఆ తరువాత అందరూ ఆలయ ప్రాంగణంలోనే మద్యం సేవించి.. నైవేద్యంగా సమర్పించిన  కోడి మాంసం భుజిస్తారు. ఇలా చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పాతతరం వారు చెప్పేవారిని, నేటికీ ఆ వేడుకలు నిర్వహిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. 

click me!