
కోల్‌కతా: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లో ఈ ఘటన జరిగింది. ఇది తృణమూల్ కాంగ్రెస్ సమర్థకుల దాడే అని కేంద్రమంత్రి ప్రమాణిక్ ఆరోపణలు చేశారు. ఈ దాడిలో కేంద్రమంత్రి ఎస్‌యూవీ కారు విండ్ షీల్డ్ ధ్వంసమైంది. రాళ్ల దాడిని అడ్డుకోవడానికి ఆ జన సమూహంపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిషిత్ ప్రమాణిక్ కూచ్ బెహార్ ఎంపీ.
ఒక కేంద్ర మంత్రికే రక్షణ లేకుంటే.. ఇక్కడ సామాన్య పౌరుల పరిస్థితి ఏమిటో తాను అర్థం చేసుకోగలనని కేంద్రమంత్రి నిషిత్ ప్రమాణిక్ అన్నారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం దుస్థితిని ఇది వెల్లడిస్తున్నదని వివరించారు.
కేంద్ర మంత్రి స్థానిక బీజేపీ ఆఫీసుకు వెళ్లుతుండగా ఈ దాడి ఘటన జరిగింది.
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫైరింగ్‌లో ఓ గిరిజనుడి మరణం గురించి స్థానికుల్లో కేంద్ర మంత్రి నిషిత్ ప్రమాణిక్ పై ఆగ్రహం నెలకొని ఉన్నట్టు స్థానిక వర్గాలు వివరించాయి.
ఇటీవలే ఇక్కడ నిర్వహించిన ఓ ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆ హత్య తర్వాత గిరిజనుల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించే ప్రయత్నాలను సరిగా చేయలేదని కేంద్ర మంత్రి నిషిత్ ప్రమాణిక్ పై ఆయన ఆరోపణలు సంధించారు. అంతేకాదు, నిషిత్ ప్రమాణిక్‌కు వ్యతిరేకంగా తాము నిరసనలు చేయబోతున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ ఇటీవలే ప్రకటించింది కూడా. ఈ ప్రాంతంలో కేంద్ర మంత్రి నిషిత్ ప్రమాణిక్ ఎక్కడికి వెళ్లినా ఆయనకు నిరసనల సెగలే ఎదురవుతాయని తృణమూల్ లీడర్ ఉదయన్ గుహా అన్నారు.