
కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్లీనరీ రెండో రోజైన శనివారం నాడు పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్లీనరీలో రాజకీయ తీర్మానాల వేళ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తమ పార్టీ కట్టుబడి ఉన్నట్టుగా ప్లీనరీ వేదికగా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
ఆ ముసాయిదా తీర్మానంలో ఏముందంటే.. ‘‘కొండ ప్రాంతాల రాష్ట్రాలు అభివృద్ధికి సంబంధించి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఆ రాష్ట్రాలకు అదనపు మద్దతు అవసరం. ఈ మద్దతును అందించిన ‘‘ప్రత్యేక కేటగిరీ’’ హోదా రద్దు ఈశాన్య, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రయోజనాలకు నష్టం చేకూరుస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పునరుద్ధరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చేందుకు కాంగ్రెస్ కూడా కట్టుబడి ఉంది” పేర్కొన్నారు.
ఇక, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని.. అధికారంలోకి వస్తే ఆ హామీని నెరవేరుస్తామని పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తూ వస్తోంది. ఇటీవల భారత్ జోడో యాత్ర సందర్భంగా కూడా రాహుల్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు, అమరావతిలో ఒకే రాజధానిని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. 2014లో పార్లమెంట్‌లోనూ, పార్లమెంటులోనూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన వాగ్దానాలను గుర్తుచేస్తున్నాం. ఇవి ఒక్కరు చేసిన, ఒక్క పార్టీ చేసిన హామీలు కావు. పార్లమెంటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించబడినవి. ఈ హామీలను పూర్తిగా, వేగంగా నెరవేర్చాలని మేము భావిస్తున్నాం. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయి’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.