Republic Day: ఈవెంట్ తరువాత పేపర్ ఫ్లాగ్స్ నేలపై పడేయొద్దు, ఫ్లాగ్ కోడ్ అమలుకు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

By Mahesh KFirst Published Jan 18, 2022, 1:33 PM IST
Highlights

గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో కేంద్ర హోం వ్యవహారాల శాఖ జాతీయ జెండా వినియోగం, దాని డిస్పోజల్ గురించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఓ అడ్వైజరీ నోట్ పంపింది. ఫ్లాగ్ కోడ్‌ను తప్పకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయాలని ఆదేశించింది.  ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో వినియోగించే పేపర్ జెండాలను ఈవెంట్ ముగిసిన తర్వాత అక్కడే పడేసి వెళ్లకూడదని, వాటిని ప్రైవేట్‌గా.. తగిన గౌరవంతో డిస్పోజ్ చేయాలని సూచించింది.

న్యూఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ(Republic Day Celebrations) వేడుకల్లో ఎటు చూసిన త్రివర్ణ పతాకమే కనిపిస్తుంది. ఆ మూడు రంగులతో ప్రాంగణాలు ముస్తాబై ఉంటాయి. ఆ పరిసరాలు చూడగానే మనసులో దేశ భక్తి ఉప్పొంగుతుంది. అంతటి శక్తి జాతీయ జెండాకు ఉన్నది. అది భారతీయుల ఆశలు, లక్ష్యాలను సూచిస్తుంది. అందుకే త్రివర్ణ పతాకం(National Flag) గౌరవప్రదమైనది. ఈ పతాకానికి నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. అయితే, అంత పకడ్బందీగా రూపొందించుకున్న మువ్వన్నెల జెండాను జాతీయ కార్యక్రమాలు ముగిసిన తర్వాత కూడా అంతే గౌరవప్రదంగా ఉంచాలి. పేపర్ జెండాల విషయంలో ఇది కచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే.. సాధారణంగా ఈ వేడుకల్లో ప్రేక్షకులు, అతిథులు మొదలు చాలా మంది పేపర్ జెండాల(Paper Flags)ను చేతబూని సంబురంగా ఆకాశానికి చూపుతూ రెపరెపలాడిస్తుంటారు. వీటి వినియోగమే ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి.. కార్యక్రమం ముగిసిన తర్వాత వాటిని అక్కడే నేలపై పడేసి వెళ్లవద్దని కేంద్రం స్పష్టం చేసింది.

గణతంత్ర దినోత్సవాలు సమీపించిన తరుణంలో కేంద్ర హోం వ్యవహారాల శాఖ(MHA) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శుక్రవారం ఓ అడ్వైజరీ పంపింది. ఫ్లాగ్ కోడ్‌(Flag Code)ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. జాతీయ పతాకం.. మన దేశ ప్రజల ఆశలు, ఆశయాలకు ప్రతీక అని, కాబట్టి.. త్రివర్ణ పతాకానికి ఉన్నతమైన గౌరవం ఉంటుందని ఆ అడ్వైజరీలో కేంద్రం పేర్కొంది. జాతీయ పతాకంపై అందరికీ గౌరవాభిమానాలు ఉన్నాయని తెలిపింది. అయితే, జాతీయ పతాక ప్రదర్శనకు సంబంధించిన చట్టాలపై కొంత మందికి, కార్యక్రమ నిర్వాహకులు, ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలకు అవగాహన కొరవడిందని కొన్ని ఉదంతాలు చెబుతాయని వివరించింది.

భారత పతాక కోడ్ ప్రకారం, ముఖ్యమైన జాతీయ వేడుకలు, సాంస్కృతిక, క్రీడాపరమైన వేడుకల్లో జాతీయ జెండాలను ఉపయోగిస్తారని వివరించింది. అయితే, ఆ కార్యక్రమాల్లో పేపర్ ఫ్లాగ్స్‌నూ విరివిగా వినియోగిస్తారని తెలిపింది. ప్రజలు ఎక్కువగా వీటిని చేత పట్టుకుని కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొంది. అయితే, కార్యక్రమం ముగిసిన తర్వాత వారు ఆ జెండాను అక్కడే నేలపై పడేసి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఆ జెండాలను ప్రైవేట్‌గా తగిన గౌరవంతో డిస్పోజ్ చేయాలని సూచించింది. అంతేకాదు, జెండా వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం వ్యవహారాల శాఖ సూచనలు చేసింది.

భారత పతాకంలో మూడు సమాన వైశాల్యాలు, చుట్టుకొలతలతో దీర్ఘచతురస్త్రాకారాలు ఉంటాయి. అందులో పైన దాంట్లో కేసరి రంగు, కింది భాగాన ఇండియా గ్రీన్, మధ్యలో తెలుపు వర్ణం ఉంటుంది. తెలుపు వర్ణం మధ్యలో అశోక చక్రం ఉంటుంది. ఆ చక్రం జెండాకు రెండు వైపులా కనిపించాలి. అశోక చక్రం లోపలా సరైన దూరంలో 24 రేకులు ఉంటాయి.  3:2 నిష్పత్తితో పతాకం వెడల్పు.. ఎత్తు ఉండాలి. అయితే, కొన్ని ప్రత్యేక ప్రదేశాలను బట్టి కూడా జెండా పరిమాణాన్ని చూసుకోవడం మంచిది. ఉదాహరణకు వీవీఐపీ విమానాలకు 450 ఎంఎం, 300ఎంఎం సైజులో జెండా ఉండగా, మోటార్ కార్ల కోసం 225*150 ఎంఎం సైజులో, టేబుల్ ఫ్లాగ్ కోసం 150*100 ఎంఎం సైజులో ఉంచడం సముచితం.

click me!