శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణం.. అక్కడ జరుగుతన్న పనులపై గ్రౌండ్ రిపోర్ట్..

By Sumanth KanukulaFirst Published Oct 25, 2022, 3:33 PM IST
Highlights

అయోధ్యలో విశాలమైన రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అక్కడి కార్మికులు పనిచేస్తున్నారు.

అయోధ్యలో విశాలమైన రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అక్కడి కార్మికులు పనిచేస్తున్నారు. లక్షలాది మంది భక్తుల ఆకాంక్షలను నెరవేర్చడానికి వందలాది మంది పని చేస్తున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులకు సంబంధించి ఏషియానెట్ న్యూస్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏషియా నెట్ న్యూస్ బృందం అయోధ్యను సందర్శించగా.. అప్పుడు భవనం కేవలం 5.5 అడుగుల ఎత్తులో ఉంది. ప్రస్తుతం భవనం ఎత్తు 21 అడుగులకు చేరింది. 

ఏప్రిల్‌లో అయోధ్యను సందర్శించిన సమయంలో ఏషియానెట్ న్యూస్ సిబ్బంది.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రాతో మాట్లాడారు. ఆ సయమంలో నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. డిసెంబర్ 2023 నాటికి ఆలయంలో శ్రీరాముని సంగ్రహావలోకనాన్ని భక్తులు పొందాలని తాను భావిస్తున్నట్టుగా చెప్పారు. అలాగే నిర్మాణ ప్రణాళికల గురించి కూడా వివరించారు. 

ఇక, నేడు రామాయల నిర్మాణం 21 అడుగులకు చేరుకుంది. రాజస్తాన్‌లోని బన్సీ పహర్‌పూర్ నుంచి రాళ్లను నిర్మాణ స్థలానికి తీసుకువచ్చారు. గర్భగుడి కోసం స్తంభాల రాళ్లు సిద్ధంగా ఉన్నాయి. గర్భగుడి మొదటి అంతస్తు నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. గర్భగుడిని గ్రానైట్ రాయితో 6.5 మీటర్ల ఎత్తులో నిర్మిస్తన్నారు.

మరోవైపు ఆలయ నిర్మాణానికి సంబంధించిన దాదాపు సగం రాళ్లు చెక్కబడి సిద్ధంగా ఉన్నాయి. భవనం చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించారు. కాంప్లెక్స్‌లోని ఇతర భవనాల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఎల్‌ అండ్‌ టీ, టాటా కన్సల్టెన్సీల ఆధ్వర్యంలోని నిర్మాణ బృందాలు గత కొన్ని నెలలుగా కురుస్తున్న ఆకస్మిక వర్షాల కారణంగా ఏర్పడిన ఆలస్యాన్ని పూడ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఆలయ పనుల పురోగతి గురించి మరింత అర్థం చేసుకోవడానికి రామ మందిర నిర్మాణ పనులను నిర్వహిస్తున్న కంపెనీలలో ఒకటైన లార్సెన్ అండ్ టూబ్రో ప్రాజెక్ట్ మేనేజర్ వినోద్ కుమార్ మెహతాతో ఆసియానెట్ న్యూస్ బృందం మాట్లాడింది. 57,400 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం, 67 ఎకరాల విస్తీర్ణంలో ఒక కాంప్లెక్స్‌తో.. అయోధ్యలోని రామమందిరం పూర్తయితే అద్భుతమైన హస్తకళ, భారీ ఇంజనీరింగ్‌కు చిహ్నంగా ఉంటుంది.

రామాలయం అయోధ్యను నిజమైన అంతర్జాతీయ నగరంగా మారుస్తుందని భావిస్తున్నారు. ఆ మిషన్‌ను శక్తివంతం చేయడానికి అయోధ్య స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కూడా చేపట్టారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్.. ఆర్థికాభివృద్ధి, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం, మరింత సంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని నిర్ధారించడానికి సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన పురోగతి క్షేత్రస్థాయిలో ఇప్పటికే కనిపిస్తోంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుండగా.. రామ్ కథా గార్డెన్ సహా పట్టణ సుందరీకరణ పనులు కూడా కొనసాగుతున్నాయి.

అయితే.. ఇటీవల కురిసిన వర్షాలు లక్నో-అయోధ్య రోడ్డును కొంత అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం అయోధ్య పట్టణంలో రామజన్మభూమిని సందర్శించే భారీ సంఖ్యలో యాత్రికుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాల కొరత నెలకొంది. అయితే ప్రస్తుతం ఇబ్బందికరంగా ఉన్న రోడ్లు, మౌలిక సదుపాయాలు రానున్న రోజుల్లో మంచిగా మారుతాయని అయోధ్య ప్రజలు నమ్మకంతో ఉన్నారు. 

ఇక, ఎంతోమంది ఆశలు, కలలు, ఆకాంక్షలు అయోధ్యలోని రామమందిరంతో పెనవేసుకున్నాయి. దేశవ్యాప్తంగా, విదేశాలలో ఉన్న లక్షలాది మంది హిందువులు.. పూర్తి వైభవంతో శ్రీరాముని సంగ్రహావలోకనం పొందాలని ఆశిస్తున్నారు.

click me!